లోకం చుట్టిన గ్రీకు వీరుడు మన చంద్రబాబు

611

భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా స్వతంత్ర భారత దేశంలో పెట్టుబడుల పేరుతో ప్రపంచాన్ని చుట్టివచ్చిన ముఖ్యమంత్రి మరొకరు లేరు. ప్రతి రెండు మూడు నెలలకోసారి పెట్టుబడుల ఆకర్షణ అంటూ పాతికమందిని వెంటేసుకుని వారంరోజుల విహారం చెయ్యడం, ఆ దేశాల్లో ఉండగానే ఎవరెవరితోనో మీటింగ్లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ పెట్టడం, వేలకోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పడం, వెంటనే తెలుగుదేశం అనుకూల పత్రికలు దానికి అల్లంవెల్లుల్లి మసాలా దట్టించి ఇక్కడ బిర్యాని వండటం షరామామూలు అయింది.

గత మూడేళ్ళలో చంద్రబాబు దేశప్రధాని మోడీతో పోటీపడి విదేశాల్లో విహరించారు. దేశాధినేత చంద్రబాబా లేక మోడియా అనే సందేహం కలిగేట్లు చెయ్యడం చంద్రబాబు చమత్కారాల్లో ఒకటి మాత్రమే. అభివృద్ధిలో దూసుకునిపోతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కరు కూడా విదేశీ విమానాలు ఎక్కడం లేదు. అవినీతిలో దూసుకుని పోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం గగనవిహారానికి విరామం ఇవ్వడం లేదు.

గత మూడేళ్ళలో శంకుస్థాపనలే తప్ప ప్రారంభోత్సవాలు చూడలేదు. ఇవాళ్టికి కూడా శంకుస్థాపనలు తప్ప ఓపెనింగులు మాత్రం లేవు. అసలు విదేశాలలో ఉన్న అంతటి గొప్ప పెట్టుబడిదారులు ఎవరు? ఆమాత్రం పెట్టుబడిదారులు మనదేశంలో లేరా? చంద్రబాబు మంత్రివర్గంలోని యనమల ఆ మధ్య పొరుగురాష్ట్రం తెలంగాణాలో రెండువేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారని తెలుగుదేశం తెలంగాణ శాఖ నాయకుడు చెప్పారు కదా? వెతకాలి కానీ అసలు తెలుగుదేశం పార్టీలోనే వందలమంది పెట్టుబడిదారులు ఉన్నారు. మేకపిల్లను చంకలో పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే ఇదే మరి..

Chandrababu foreign tours in the name of investmentsలోకం చుట్టిన గ్రీకు వీరుడు మన చంద్రబాబు

విదేశీపెట్టుబడిదారులు చంద్రబాబు ముఖం చూసో, జగన్ ముఖం చూసో, కేసీయార్ ముఖం చూసో రారు. వాళ్ళు పెట్టుబడులు పెట్టేచోట మౌలికవసతులు ఎలా ఉన్నాయా అని చూస్తారు. అవినీతిస్థాయి ఎలా ఉన్నది అని చూస్తారు. కరెంట్, నీటి వసతి, రవాణా వ్యవస్థ, విమానం దిగి పదినిముషాల్లో మన కంపెనీకి చేరుకోగలమా, మనకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంటుందా, విదేశీయులు బసచేయడానికి తగినన్ని విలాసవంతమైన హోటల్స్ ఉన్నాయా లాంటి అనేక ప్రాధాన్యత కలిగిన అంశాలను పరిశీలిస్తారు. అటు చూస్తే రోజుకు ఇద్దరు ముగ్గురు అవినీతి తిమింగలాలు అవినీతి నిరోధక శాఖకు దొరుకుతున్నాయి. మూడేళ్ళలో చంద్రబాబు చేసిన నిర్వాకం ఏమిటంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు…అంటే రాష్ట్రం దాదాపు ఆర్ధికంగా దివాళా దశలో ఉన్నది. సముద్రాన్ని చూసి, కృష్ణా గోదావరిని చూసి పెట్టుబడిదారులు ఎగదోసుకుంటూ రారు.

అసలు చంద్రబాబుకు చిత్తశుద్ధి అనేది ఉంటె మనదేశంలోనే లక్షలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేవారు ఉన్నారు. వారిని ఆహ్వానించాలి. వారిని ఒప్పించగలిగితే చాలు. పెట్టుబడుల వరదలు వస్తాయి. కానీ చంద్రబాబు అలా చెయ్యరు. చేస్తే… ఇక రాబోయే ఎన్నికల్లో ఆయనకు చెప్పుకోవడానికి ఏమీ ఉండదు.

– ఇలపావులూరి మురళీ మోహన రావు