జ‌గ‌న్ మాటల తూటాలకు విలవిలలాడుతున్న చంద్ర‌బాబు

330

వైఎస్ జ‌గ‌న్..గ‌డిచిన వారం, ప‌దిరోజులుగా ఏపీలో అత్యంత వివాదాస్ప‌ద‌మ‌వుతున్న నేత‌. ఆయ‌న చుట్టూ వివాదాలు అల్లుతున్న‌ప్ప‌టికీ వెనక్కి త‌గ్గుతున్నట్టు క‌నిపించ‌ని నాయ‌కుడు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ముఖ్యమంత్రి మీద విమ‌ర్శ‌లే కాదు ఇప్పుడు ఏకంగా మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. అందులోనూ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఓ స్థాయిలో హీటు రాజేస్తున్నారు. 3వ తేదీన నంద్యాల‌లో జ‌రిగిన భారీ బ‌హిరంగ‌స‌భ నుంచి మొద‌లు ప్ర‌స్తుతం ఎ న్నిక‌ల ప్ర‌చారం వ‌ర‌కూ ఆయ‌న అన్ని చోట్లా చంద్ర‌బాబు మీద గురిపెడుతున్నారు. చంద్ర‌బాబు విధానాల మీద దండెత్తుతున్నారు. అధికార పార్టీని ఇరుకున‌పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్నారు.

దాంతో ఇప్పుడు జ‌గ‌న్ ఓ మాట వ‌ద‌ల‌డం, దానిని ప‌ట్టుకుని అధికార పార్టీ రాష్ట్ర‌మంతా రోడ్డెక్క‌డం అల‌వాటుగా మారుతోంది. ప‌క్క‌నే ఉన్న సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణాలో సీఎం మాట‌ల దాడి చేస్తారు, విప‌క్షాలు దానిని ఎదుర్కోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం దానికి భిన్నం. ఇక్క‌డ దాడి విప‌క్ష నేత‌ది. దానికి ఆత్మ‌ర‌క్ష‌ణ చేసుకోవ‌డం అధికార పార్టీ వంత‌వుతోంది. చివ‌ర‌కు సీఎంకే ర‌క్ష‌ణ లేద‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించే వ‌ర‌కూ అధికార పార్టీ నేత‌లు వెళ్ల‌డం చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎంత డిఫెన్స్ లో ఉందో చాటిచెబుతోందంటున్నారు.

వాస్త‌వానికి చంద్ర‌బాబుని కాల్చినా త‌ప్పులేద‌ని, ఆ త‌ర్వాత ఉరితీసినా త‌ప్పులేద‌ని, తాజాగా చంద్ర‌బాబుని ఏమీ అన‌కూడ‌దా అని ఇలా జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు ప‌క్కా వ్యూహాత్మ‌కంగానే క‌నిపిస్తోంది. కానీ దానిని గ్ర‌హించ‌కుండా టీడీపీ ఆ ఉచ్చులో ఇరుక్కుంటుందా అన్న సందేహం క‌లుగుతోంది. వాస్త‌వానికి నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో తెలుగుదేశం భూమా కుటుంబానికి టికెట్ ఇచ్చి సెంటిమెంట్ తో గట్టెక్కాల‌ని ఆశించింది. కానీ ఇప్పుడు సెంటిమెంట్ అనే అంశ‌మే ప‌క్క‌క‌పోయింది. దానికి కార‌ణం జ‌గ‌న్ వ్యూహ‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు. పైగా చంద్ర‌బాబు అభివృద్ది మంత్రం కూడా పనిచేయ‌కుండా జగ‌న్ వేసిన ఎత్తు ఫ‌లించిన‌ట్టే క‌నిపిస్తోంది. వాస్త‌వానికి నంద్యాల‌లో టీడీపీకి అన్నీ అన‌నుకూల సంకేతాలే. మైనార్టీలు టీడీపీ ప‌ట్ల విముఖ‌త‌తో ఉన్నారు. కీల‌క‌మైన రెడ్లు టీడీపీకి పూర్తి వ్య‌తిరేకం. బ‌లిజ‌లు దూర‌మ‌య్యారు. వైశ్యుల్లో చీలిక ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి అన్ని స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించే అస్త్రం సెంటిమెంట్ అని ఆశిస్తే ఇప్పుడ‌ది బూమ‌రాంగ్ కావ‌డానికి టీడీపీ చేజేతులా చేసుకున్నదే అన్న‌ట్టుగా ప‌లువురు భావిస్తున్నారు.

Chandrababu got sick due to Jagan criticismజ‌గ‌న్ మాటల తూటాలకు విలవిలలాడుతున్న చంద్ర‌బాబు

చంద్ర‌బాబు మీద జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల గురించి ఆలోచిస్తూ అస‌లు వ్య‌వ‌హారాల‌ను టీడీపీ విస్మ‌రించిన‌ట్టు క‌నిపిస్తోంది. వ‌రుస‌గా రెండు రోజుల పాటు నంద్యాల ఎన్నిక‌ల ప్ర‌చారంలో అఖిల‌ప్రియ బైఠాయింపు, సోమిరెడ్డి ర్యాలీ చూస్తే ఈ విష‌యం అర్థ‌మ‌వుతోంది. కీల‌క‌మైన స‌మయంలో విప‌క్షం మీద ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేయ‌డం ప్ర‌యోజ‌నం ఇవ్వ‌ద‌న్న‌ది అంద‌రూ అంగీక‌రించే స‌త్యం. అయినా టీడీపీ నేత‌లు మాత్రం ప్ర‌చార వ్యూహాల‌కు ప‌దును పెట్టాల్సింది పోయి అధికారంలో ఉండి ప్ర‌తిప‌క్ష నేత మీద ఆందోళ‌న‌లు చేయ‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని నంద్యాల ఓట‌ర్లు వ్యాఖ్యానించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదే స‌మ‌యంలో నంద్యాల‌లో చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించే అవ‌కాశం కూడా కోల్పోతున్నారు. మూడున్న‌రేళ్ల‌లో నంద్యాల‌కే కాదు క‌ర్నూలు జిల్లాకే చంద్ర‌బాబు ఏమీ చేయ‌లేద‌ని విమ‌ర్శిస్తున్న జ‌గ‌న్ మాట‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు.

ఇలాంటి స్థితిలో అధికార పార్టీకి ప‌రువు నిలుపుకోవ‌డం త‌ప్ప త‌లెత్తుకుని నిల‌బ‌డ‌గ‌లిగే అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌న్న‌ట్టు జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు. ఈసీకి వివ‌ర‌ణ ఇచ్చిన త‌ర్వాత కూడా ఉరి అంశం ప్ర‌స్తావించ‌డం, నంద్యాల‌లో అభివృద్ది తాము పోటీలో ఉండ‌డం వ‌ల్లేన‌ని, ఆ క్రెడిట్ కూడా తానే కాజేసే య‌త్నం చేయ‌డం గ‌మ‌నిస్తే జ‌గ‌న్ ముందుచూపు అర్థ‌మ‌వుతోంది. అయినా దానిని గ్ర‌హించ‌లేని టీడీపీ అవ‌స్థ‌ల్లో చిక్కుకుంటోంది. ఏం చేస్తాం..ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు ఇలానే ఉంటుంద‌ని ఓ సీనియ‌ర్ మంత్రి చేసిన వ్యాఖ్య‌లు ఇక్క‌డ గ‌మ‌నార్హం.

– సాధు వీరశేఖర రెడ్డి