భాజపాయేతర కూటమికి మద్దతు పెరుగుతోంది

270

2019లో దేశంలో 1996 రాజకీయాలు పునరావృతమవుతాయని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి జోస్యం చెప్పారు. చంద్రబాబు రాజకీయ ఎత్తుగడులు వ్యూహాత్మకంగా ఉంటాయని ఆయన ప్రశంసించారు.

భాజపాయేతర కూటమి చర్చల కోసం చంద్రబాబు బెంగళూరు వెళ్ళి దేవేగౌడ, కుమారస్వామితో దాదాపుగా 40 నిమిషాల పాటు జాతీయ రాజకీయాలపై చర్చించారు. చంద్రబాబు ప్రయత్నాలకు వారు సంపూర్ణ మద్దతు తెలిపారు. సెక్యులర్ శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉందని దేవేగౌడ అభిలాష వ్యక్తం చేసారు. దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందన్న చంద్రబాబు అభిప్రాయంతో ఏకీభవించారు.

చంద్రబాబు మాట్లాడుతూ మొదటి నుంచి దేవెగౌడతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, భాజపాయేతర కూటమి ఏర్పాటుకు ఆయన మద్దతు కోరామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని పరిరక్షించుకునేందుకు భాజపా వ్యతిరేక పక్షాలన్నీ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో చర్చలు జరిపినట్లు వివరించారు. శుక్రవారం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశం కానున్నట్లు ప్రకటించారు.

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. దీనికోసం దేశంలోని లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. భాజపాయేతర కూటమిపై చంద్రబాబుతో చర్చలు జరిపామని కూటమి ఏర్పాటులో కాంగ్రెస్‌ కూడా తమతో కలిసివస్తోందని దేవెగౌడ అన్నారు. కూటమి బలోపేతం కోసం మిగతా పార్టీలతో చర్చలు జరపాలని చంద్రబాబుని కోరినట్లు వివరించారు. కూటమి ఏర్పాటులో దేవెగౌడ, చంద్రబాబు వ్యూహాలు బాగున్నాయని కుమారస్వామి ప్రశంసించారు.