‘బంద్’తో ఏం సాధిస్తారు ..అన్న సీఎం గారు ‘దీక్ష’ చేస్తారట.!

108
రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్రం తీరుకి నిర‌స‌న‌గా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ఒక రోజు నిరాహార దీక్ష చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. గుంటూరు జిల్లా శాఖమూరులో జ‌రిగిన అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్న ఆయన  మాట్లాడుతూ త‌న జ‌న్మ‌దినం అయిన ఈ నెల 20న నిరాహార దీక్ష చేయ‌బోతున్నట్లు ప్రకటించారు. ఆ త‌రువాత‌, ఈ నెల 30న తిరుప‌తిలో భారీ బ‌హిరంగ పెడుతున్న‌ట్టు తెలిపారు.
నాలుగేళ్ళ కింద‌ట ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మోడీ తిరుప‌తి వ‌చ్చార‌నీ, ఏడుకొండ‌ల‌వాడి సాక్షిగా మ‌న‌కు హామీ ఇచ్చార‌నీ, కానీ, దాన్ని అమ‌లు చేసే ప‌రిస్థితి ఇప్ప‌టివ‌ర‌కూ లేద‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం లాలూచీ రాజకీయం చేస్తోంద‌న్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే, ఉన్నవి చాల‌ద‌న్న‌ట్టుగా బంద్ పిలుపు నిచ్చార‌న్నారు. కేంద్రం అన్యాయం చేసింద‌నీ, వారి ఆలోచ‌న‌కు అనుగుణంగా ప్ర‌తిప‌క్షాలూ అభివృద్ధిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తే చివరికి న‌ష్ట‌పోయేది ఎవ‌ర‌ని ప్ర‌శ్నించారు.
ఆంధ్రాలో) భాజ‌పా లేద‌నీ, ఒక్క ఓటు కూడా ప‌డే ప‌రిస్థితి ఉండదన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 25 మంది తెదేపా ఎంపీల‌ను గెలిపించాల‌నీ, భ‌విష్య‌త్తులో ఢిల్లీని శాసించేది తెలుగుదేశం పార్టీ మాత్ర‌మే అని చంద్ర‌బాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అదిచేస్తా ఇదిచేస్తా అని తిరుగుతున్న ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఇంత‌వ‌ర‌కూ చేసిన అనుభ‌వం ఏద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌తీ శుక్ర‌వారం కోర్టుకు వెళ్ళి వ‌చ్చి త‌న‌ను విమ‌ర్శించ‌డ‌మేనా విశ్వ‌స‌నీయ‌త అని ప్ర‌శ్నించారు.  ఇలాంటివారు వారి కేసుల్ని మాత్ర‌మే చూసుకుంటార‌నీ, అందుకే అప్ప‌ట్లో కాంగ్రెస్ తో లాలూచీ ప‌డ్డార‌నీ, ఇప్పుడు భాజ‌పాతో అలాంటి రాజ‌కీయాలే చేస్తున్నారు అన్నారు.
చంద్రబాబు మాటలు వింటుంటే ఎన్నిక‌ల మూడ్ లోకి వచ్చేసారనిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా తెదేపాకి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని కోరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెదేపా స‌త్తా చాటుతుంద‌నీ, ఢిల్లీ శాసించే స్థాయిలో ఉంటామ‌ని చెప్పిన ఆయన వారానికోసారి కోర్టుల‌కు వెళ్ళే వారు, కేంద్రంతో లాలూచీ ప‌డ‌కుండా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం రాజీలేని పోరాటం చేసే పరిస్థితి ఎక్క‌డ ఉంటుంద‌నే ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తి ఎన్నిక‌ల్లో వైకాపాను ఎదుర్కొనే ప్ర‌చార వ్యూహాన్ని దాదాపు బయటపెట్టేసారు.