మరోసారి ఆపరేషన్ గరుడను తీసుకొచ్చారు

48

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేయడానికి కేసుల్లో ఇరికించడానికి ఆపరేషన్ గరుడ రూపు మార్చుకుందని కొత్త ప్రణాళికలు అమలు చేస్తోందని నటుడు శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఆపరేషన్‌ గరుడను మరో రూపంలో అమలుచేయబోతున్నారని సోమవారం చంద్రబాబుకు ఓ రాజ్యాంగ బద్ధ సంస్థ నోటీసులు జారీ చేస్తుందని విశ్వసనీయమైన సమాచారం ఉందన్నారు. నాలుగు రోజులు ఆలస్యమైనా నోటీసులు ఇస్తారని శివాజీ చెప్పారు. ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతగా ఇబ్బంది పెట్టిన కేంద్రం మరోకటి లేదని శివాజీ ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎంను ఇబ్బంది పెట్టడమంటే భావితరాలకు నష్టం చేయడమేనన్నారు.

చంద్రబాబును పదవి నుంచి దించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భాజపా నేతలు పొలిటికల్‌ టెర్రరిస్టులుగా మారారని, తనకు ప్రాణహాని ఉందని ఇంతకంటే వివరాలు చెప్పలేనని ఆందోళన వ్యక్తం చేసారు. గత కొద్ది రోజులుగా కేంద్రం చంద్రబాబుపై గురి పెట్టిందని ప్రచారం జరుగుతూనే ఉంది. ఏ క్షణమైనా నోటీసులు రావొచ్చని ఢిల్లీ వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి.

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ చంద్రబాబుపై గురి పెట్టినట్లు శివాజీ లాంటి వారు చెబుతున్నారు.  అందుకు ప్రత్యేకమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని నమ్ముతున్నారు. తెలంగాణ రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు తెదేపా కీలకంగా మారింది. అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమ నేత కోదండరాంను ముందు పెట్టి మహాకూటమిని పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి కేంద్రం చంద్రబాబును బెదిరించేందుకు కేసుల వ్యవహారాన్ని తెరపైకి తెస్తుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.