‘చింతమనేని’ దెందులూరు పవన్ కళ్యాణ్ అట.!

131

జనసేన అధినేతకు దెందులూరు తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సవాల్ చేసారు. రాజకీయ నాయకుడిగా పవన్‌ను, తనను పక్కన పెడితే ప్రజలు తననే ఎన్నుకుంటారని తేల్చి చెప్పారు.

ప్రజా పోరాటయాత్ర లో భాగంగా బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ప్రసంగించిన పవన్ నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేసారు. గంట సేపు ప్రసంగించి చింతమనేనిపై విమర్శలు గుప్పించారు. చింతమనేనిని ఆకు రౌడీ అనడం దగ్గర ప్రారంభించి హిట్లర్ తో పోల్చారు. ఈ నేపధ్యంలో తనపై విమర్శలకు చింతమనేని గురువారం ఘాటుగా సమాధానం చెప్పారు.

తనపై 37 కేసులు ఉన్నాయని పవన్ చెప్పడాన్ని ఖండించారు. తనపై మూడు కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. పవన్ చేసిన ఆరోపణలపై బహిరంగచర్చకు రావాలని సవాల్ చేసారు. పవన్ తనతో పాటు త్రిసభ్య కమిటీని తెచ్చుకోవచ్చని ప్రతి ఆరోపణకు తాను సమాధానం ఇస్తానని సవాల్ చేశారు. మహిళలు, దివ్యాంగులపై దాడి చేసినట్లు పవన్ చెబుతున్నారని, నిరూపించాలని సవాల్ చేసారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తినని నిరూపిస్తే రాజకీయాలను తప్పుకుంటానని ప్రకటించారు.

పవన్ రాజకీయ అడుగులుపైనా చింతమనేని ఘాటు విమర్శలు చేసారు. దేశభక్తి గురించి మాట్లాడుతూ.. రాఫెల్ డీల్ గురించి నోరు ఎందుకు మెదపలేకపోతున్నారని ప్రశ్నించారు. పులివెందులకు వెళ్ళి జగన్ కేసుల గురించి మాట్లాడగలవా అని ప్రశ్నించారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న తనను ప్రజలే కోరుకుంటున్నారని స్పష్టం చేసారు. దెందులూరు నియోజకవర్గానికి మాత్రమే తెలిసిన తనను రాష్ట్రానికి తెలిసేలా చేసారన్నారు. చివరిగా తన నియోజకవర్గానికి తానే పవన్ అని చెప్పారు.