రివ్యూ : వీర ‘బోరు’ వసంత రాయలు

322

విభిన్న కథా చిత్రాల్లో నటించే నారా రోహిత్, సుధీర్‌ బాబు, శ్రీ విష్ణు ముగ్గురూ కలిసి నటించిన సినిమా ‘వీర భోగ వసంత రాయలు’. శ్రియ, శశాంక్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఇంద్రసేన దర్శకత్వం వహించాడు. టీజర్ విడుదలైనప్పటి నుండి హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంది..? చూద్దాం.

కథేమంటే..

హైదరాబాద్ సిటీలో వరుసగా అనాథ ఆడపిల్లల కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తాయి. అదే సమయంలో ఓ కుర్రాడు తన తల్లిదండ్రులతో ఇల్లు తప్పిపోయిందంటూ పోలీసు కంప్లయింట్ ఇస్తాడు. శ్రీలంక నుండి ఇండియా వస్తున్న విమానం ఆచూకీ లేకుండా పోతుంది. అందులో క్రీడాకారులు, సెల‌బ్రెటీలూ ఉంటారు. విమాన హైజాక్ కేసును దీపక్‌ (నారా రోహిత్), నీలిమా (శ్రియ)లకు అప్పగిస్తారు. ఇంటి కేసును వినయ్‌ (సుదీర్ బాబు) టేకప్‌ చేస్తాడు. విమానం స‌ముద్రంలో కూలిపోయింద‌ని, ప్ర‌యాణికుల‌న్నీ చ‌నిపోయార‌ని నిర్థారించుకున్న త‌రుణంలో ‘ప్ర‌యాణికులంతా తన ద‌గ్గ‌రే క్షేమంగా ఉన్నారని విడుద‌ల చేయాలంటే.. దేశంలో క‌రుడుగ‌ట్టిన నేర‌స్థులు మూడు వంద‌ల‌మందిని ఎన్‌కౌంట‌ర్ చేయాలి అని ఒక వ్యక్తి డిమాండ్ చేస్తాడు. అస‌లు విమానాన్ని హైజాక్ చేసింది ఎవ‌రు? మూడు వంద‌ల‌మందిని చంపాల‌ని ఎందుకు అడిగాడు? హైద‌రాబాద్‌లోని కిడ్నాపుల‌కు, ఇల్లు త‌ప్పిపోవ‌డానికీ, ఈ హైజాక్‌కీ సంబంధం ఏమిటి? అనేదే క‌థ‌.

ఎలా ఉందంటే..

సినిమా తొలి స‌న్నివేశాలు చూస్తే కిడ్నాపులు, హైజాక్‌, ఇల్లు త‌ప్పిపోయింద‌న్న కంప్లైంట్ కాస్త ఉత్సుక‌త క‌లిగిస్తాయి. అంత‌లోనే నీరుగారిపోయే స‌న్నివేశాలు ఒక‌దాని త‌ర‌వాత ఒక‌టి వ‌చ్చిప‌డిపోతుంటాయి. ఇంత సీరియ‌స్ ఇష్యూని ప‌ట్టుకుని శ్రీ‌నివాస‌రెడ్డి అండ్ కో కామెడీ చేస్తుంటుంది. మూడొంద‌ల‌మంది సెల‌బ్రెటీలు, అందులోనూ క్రికెట‌ర్లు ఉన్న విమానం హైజాక్ అయితే విచార‌ణ ఎంత వేగ‌వంతంగా జ‌రుగుతుంది? ఎన్ని ప‌క‌డ్బందీ వ్యూహాలుంటాయి? ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు చేష్ట‌లుండిపోతారు. ఒక ద‌శ‌లో విమాన ప్ర‌యాణికుల‌కు, వీర భోగ వ‌సంత రాయల‌కూ సంబంధం లేద‌ని తెలుస్తుంది. అలాంట‌ప్పుడు కూడా డిమాండ్‌ని తీర్చ‌డానికి అధికారులంతా రంగంలోకి దిగుతారు. క్లైమాక్స్ అయితే ర‌చ్చ ర‌చ్చ‌. అప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన క‌థంతా మ‌రోసారి రింగు రింగులుగా తిరిగి క‌నిపిస్తుంది.

ఎవరెలా..

శ్రీవిష్ణు పాత్రను హైలెట్‌ చేసినా సినిమాలో ఎక్కువ సేపు సుధీర్‌ బాబు కనిపించాడు. సుధీర్‌ బాబుకు మరొకరితో డబ్బింగ్‌ చెప్పించటం బాలేదు.నారా రోహిత్, శ్రియలకు తెర మీద కనిపించింది కొద్ది సేపే కావటంతో పెద్దగా ప్రూవ్‌ చేసుకునే అవకాశం దక్కలేదు.కీలకమైన పాత్రలో శ్రీవిష్ణు తీవ్రంగా నిరాశపరిచాడు. విలన్‌ లుక్‌లో ఆకట్టుకోలేకపోయాడు. డైలాగ్‌ డెలివరీ కూడా నిరాశకలిగిస్తుంది. మూడు భిన్నమైన కేసుల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు ఆ కథను అనుకున్నట్టుగా తెర మీద చూపించటంలో ఫెయిల్‌ అయ్యాడు. చాలా సన్నివేశాలు లాజిక్‌ లేకుండా సాగుతూ ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి.

ఫైనల్ గా..

‘ఈనాడు’ లాంటి కథను చెప్పాలంటే సూటిగా అర్ధమయ్యేలా చెప్పాలి.  ఇంకో కోణంలో చెప్పాల‌నుకుని ‘వీర బోరు వ‌సంత రాయులు’గా తీర్చిదిద్దాడు.