తెదేపా, భాజపాలపై ‘చార్జిషీటు’తో మరో తడబాటు

189

ఏపీలో కాంగ్రెస్‌ ఉనికి కోసం అద్యక్షుడు రఘువీరారెడ్డి ఏదోలా తంటాలు పడుతున్నారు. ఇటీవల గుంటూరులో రాహుల్‌గాంధీ సభతో కొంత వూపిరి వచ్చిందనిపించాడు. ఇదే ఊపులో తెలుగుదేశం ప్రభుత్వంపై ఒక ఛార్జిషీటు విడుదల చేసారు. చాలాకాలంగా తెలుగునాట ఇది సంప్రదాయంగా వస్తున్నదే. అయితే ఈ సందర్భంలో రఘువీరా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి ముడుపులు పంపిస్తున్నారని ఆరోపించడం కొత్త చర్చకు దారితీసింది.

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు అధిష్టానానికి ముడుపులు ఇస్తుంటారనే ఆరోపణ మొదటి నుంచి వుంది. భాజపాలోనూ వనరుల సమీకరణ పెద్ద ఎత్తునే జరుగుతుంటుంది. అయితే రెండు పార్టీల మధ్యన ముడుపుల మార్పిడి కష్టమే. పైగా అంబానీ, అదానీ వంటి హేమాహేమీ కార్పొరేట్లతో ముడిపడిన మోడీకి ఇక్కడ నుంచి చంద్రబాబు చేతులమీదుగా ముడుపులు తీసుకునే అవవసరం ఏముంటుంది? వారిద్దరి మధ్య ఆ విధమైన కెమిస్ట్రీ కూడా ఉట్టు లేదు. అయితే ఎమోషన్‌లో రఘువీరా చేసిన ఈ వ్యాఖ్యతో భాజపాను కూడా దూరం చేసుకున్నట్టయింది.

భాజపా పెద్దన్నగా వెంకయ్య నాయుడే ఇక్కడి లావాదేవీలన్నీ చూస్తున్నారనేది వారి ఘోష కూడా. కోస్తా జిల్లాల్లో భారీ కేటాయింపులు కాంట్రాక్టులపై వెంకయ్య ముద్ర బలంగా ఉందని భాజపా వారే అంటుంటారు. మోడీ అమిత్‌ షాలు చంద్రబాబుకు ఆ అవకాశం ఇవ్వకుండా తమే పగ్గాలు చేపట్టాలని చూస్తున్నారు.ఈ నేపథ్యంలో పిసిసి అద్యక్షుడు తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇవ్వొచ్చేమో.