భాజపాని నమ్మితే ‘తెలంగాణ’ను మార్చేస్తారట

87

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ హైద‌రాబాద్ లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ‘మాపై న‌మ్మ‌కం ఉంచి అవ‌కాశం ఇవ్వండి. దేశాన్నే మార్చాం.. తెలంగాణ‌ని మారుస్తాం’ అన్నారు.

తెదేపా గురించి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ‌గౌర‌వం కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీని కాంగ్రెస్ కి తాక‌ట్టు పెట్టేసార‌ని విమ‌ర్శించారు. తెరాస ఒక కుటుంబ స‌భ్యుల పార్టీ అనీ, కాంగ్రెస్ గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదనీ, త‌ర‌త‌రాలుగా ఒక కుటుంబానికి మాత్ర‌మే అక్క‌డ అధికార‌మ‌న్నారు. చివ‌రికి మ‌జ్లిస్ కూడా కుటుంబం నేతృత్వంలోనే ఉంద‌న్నారు. ఇలాంటి వార‌సత్వ రాజ‌కీయాలు ప్ర‌జాస్వామ్యం అస్థిత్వాన్ని దెబ్బ‌తీస్తాయ‌న్నారు.

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఏర్ప‌డ్డ తెలంగాణ‌లో గ‌డ‌చిన ఐదు సంవ‌త్స‌రాలు వృథాగా పోయాయ‌న్నారు. ఈ ఎన్నిక‌లు తెలంగాణ భ‌విష్య‌త్తు కోసం జ‌రుగుతున్నాయ‌నీ, బంగారు భ‌విష్య‌త్తు భాజ‌పాతో మాత్ర‌మే సాధ్య‌మ‌న్నారు. దేశ స‌మ‌గ్ర‌త‌, ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను కాపాడే ఒకే ఒక్క పార్టీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అన్నారు. తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబ పాల‌న పోవాల‌న్నారు. కేసీఆర్ కి చంద్ర‌బాబు ఒక గురువ‌నీ, సోనియా గాంధీ మ‌రో గురువ‌న్నారు.

మైనారిటీల రిజ‌ర్వేషన్లను పెంచే అవ‌కాశం లేద‌నీ, ఇత‌ర కులాలూ ద‌ళితులూ ఓబీసీల వాటాలు లాక్కుని మైనారిటీల‌కు ఇవ్వాల‌ని చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇంత‌వ‌ర‌కూ తెలంగాణ ఎన్నిక‌ల ప్రచారంలో ‘మ‌జ్లిస్‌, అభివృద్ధి’ అంశాల‌నే ప్ర‌ధానంగా చేసుకుని భాజ‌పా ప్ర‌చారం సాగింది. కొత్త‌గా కుటుంబ పాల‌న పేరుతో మోడీ ఎదురుదాడికి దిగారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం భాజ‌పాని కేంద్రం నుంచి గ‌ద్దె దించాల‌న్న ప్ర‌చారం బ‌లంగా వినిపిస్తున్న నేప‌థ్యంలో వార‌స‌త్వ రాజ‌కీయాలు అనే వాద‌న‌ తీసుకొచ్చారు.