రివ్యూ : ‘అదుగో’ ..ఇదిగో ..అన్నారంతే

401

డిఫరెంట్‌ జానర్‌ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు మరో ఇంట్రస్టింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కించి అందరికి షాకిచ్చాడు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా పూర్తి లైవ్‌ 3డీ యానిమేషన్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో..చూద్దాం.

కథేమంటే..

దుర్గ అనే రౌడీ రాజధాని ప్రాంతంలోని రైతు నుంచి 1000 ఎకరాల భూమిని కబ్జా చేసి వాటిని ప్రభుత్వానికి అమ్మి కోట్లు గడించాలని ప్లాన్‌ చేస్తాడు. కానీ దుర్గ దగ్గర పని చేసే వ్యక్తి ఆ పొలాల డాక్యుమెంట్స్‌ కాపీ ఉన్న మెమరీ చిప్‌ను శక్తి అనే మరో రౌడీ మనుషులకు ఇస్తాడు. ఆ చిప్‌ను శక్తి దగ్గరకు తీసుకెళ్ళే సమయంలో చంటి అనే పిల్లాడు పెంచుకునే ‘బంటి’ అనే పందిపిల్ల దాన్ని మింగేస్తుంది. శంకర్‌, గంగరాజు హైదరాబాద్‌లో ఉండే రౌడీలు ఏనిమల్‌ రేసింగ్‌లలో బెట్టింగ్‌లు పెడుతూ దందాలు చేస్తుంటారు. ఓ రేసింగ్‌ కోసం ఓ పందిపిల్ల అవసరం పడుతుంది. పొట్ట మీద మూడు మచ్చల ఉన్న పందిపిల్ల అయితే రేసులో తప్పకుండా గెలుస్తుందని ఓ జ్యోతిష్కుడు చెప్పటంతో అలాంటి పందిపిల్లను వెతికే పనిలో పడతారు. అలా నలుగురు గూండాలు బంటీ (పందిపిల్ల) వెంటపడటం మొదలవుతుంది. ఆ ప్ర‌హ‌స‌నంలో బంటి వ‌ల్ల మిగిలిన‌వారికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? మరి ఈ రౌడీల మధ్య అభి, రాజీ అనే ప్రేమ జంట ఎలా చిక్కుకుంది.? బంటి తిరిగి చంటి దగ్గరకు ఎలా వచ్చింది.? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

ఇది పూర్తిగా రవిబాబు మార్క్‌ సినిమా. మూడు వేరు వేరు కథలను ఓ పందిపిల్లకు ముడిపెడుతూ కథ తయారు చేసుకున్న రవిబాబు కథనంలో ఏమాత్రం కొత్తదనం చూపించలేదు. అంతేకాకుండా రవిబాబు గత చిత్రాల ఛాయలు కనిపించటం నిరాశకలిగిస్తుంది. లైవ్‌ 3డీ యానిమేషన్‌లో పందిపిల్ల క్యారెక్టర్‌ ఆకట్టుకున్నా సహజంగా అనిపించదు. వీలైనంత క్వాలిటీ గ్రాఫిక్స్‌ ఇచ్చినప్పటికీ సగటు ప్రేక్షకుడికి పందిపిల్ల గ్రాఫిక్స్‌ అని అర్ధమైపోతుంది. ప్రశాంత్‌ విహారి అందించిన సంగీతం ఫరవాలేదనిపిస్తుంది. ప్రధానంగా కామెడీ నమ్ముకొని తెరకెక్కించిన ఈ సినిమాలో కొన్ని చోట్ల కామెడీ పండినా చాలా చోట్ల ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

పంది అంటే ఎంత అస‌హ్యంగా చూస్తారో అంత‌కంటే చిరాగ్గా కొన్ని స‌న్నివేశాలు సృష్టించాడు. పంది రౌడీల‌కు లిప్ లాక్కులు పెడుతుంటుంది. పంది క‌డుపులో ఉన్న చిప్‌ని బ‌య‌ట‌కు తీయ‌డానికి రౌడీ మూక చేసే ప్ర‌య‌త్నాల‌కు చిరాకేస్తుంది.
ర‌విబాబులో మంచి కామెడీ టైమింగ్ ‘అదుగో’లో మ్యాజిక్ క‌నిపించ‌దు.

ఒకే పాయింట్‌పై సాగే ఇలాంటి సినిమాలు అయితే న‌వ్వించాలి, లేదంటే థ్రిల్ క‌లిగించాలి. ఇవి రెండూ ‘అదుగో’ సాధించ‌లేక‌పోయింది. ఈ సినిమాలో పాత్ర‌లు తేలిపోయాయి. అభిషేక్ అనే పాత్ర‌ని అస్స‌లు చూడ‌లేం. ల‌వ్ ట్రాక్ కూడా ఏమాత్రం ఆక‌ట్టుకోదు. ఇలా అడుగ‌డుగునా బ‌ల‌హీన‌త‌లతో సాగిన సినిమా ‘అదుగో’.

ఎవరెలా..

నటీనటుల విషయానికి వస్తే చంటి పాత్రలో నటించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ సాత్విక్‌ వర్మ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్లు అతి చేసినట్టుగానే అనిపిస్తుంది. రవిబాబు గతచిత్రాల్లో నటులు ఈ సినిమాలోనూ రిపీట్‌ అయ్యారు. హీరో హీరోయిన్లుగా పరిచయం చేసిన అభిషేక్‌, నభాల పాత్రలు తెరమీద కనిపించేది కొద్ది సేపే. హీరో ఫ్రెండ్స్‌గా కనిపించిన విజయ్‌ సాయి, అజయ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. న‌భా అందంగా క‌నిపించింది. దానికి పూర్తి వ్య‌తిరేకం అభిషేక్‌. రాజేంద్ర ప్ర‌సాద్ ఇచ్చిన వాయిస్ ఓవ‌ర్ కాస్త బెట‌ర్ అనిపిస్తుంది.