ఏదో ఆశించి తెరాసలో చేరలేదట.!

315

కాంగ్రెస్ నుంచి తెరాస‌కు జంప్ చేసిన దానం నాగేంద‌ర్ ఎన్నో ఆశ‌లతో తెరాస‌లో చేరార‌న్న‌ది తెలిసిందే. చేర‌క ముందేమో, న‌గ‌ర మేయ‌ర్ ప‌ద‌విపై మోజును తెరాసకి తెలిపారు. కానీ అపుదేమో దానంని తెరాస చేర్చుకోలేదు.

ఆ త‌రువాత‌ తెరాస‌లో చేరినా నామినేటెడ్ పోస్టు కూడా ద‌క్క‌లేదు. వ‌చ్చే ఎన్నికల్లో ఖైర‌తాబాద్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ చాలు అని ఆశించారు. ఇప్పుడు అది కూడా ద‌క్క‌లేదు. ఈ పరిస్థితిపై దానం మాట్లాడుతూ  ‘నాకు టిక్కెట్ రాలేద‌న్న అసంతృప్తి అస్స‌లే లేదు. ఎలాంటి ష‌ర‌తులూ పెట్ట‌కుండా తెరాస‌లో చేరా. నేనుఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. నేను అన్ని రకాలుగా తృప్తిగా హ్యాపీగా ఉన్నా. నేను అల్ప సంతోషిని అస‌లే కాదు. కేసీఆర్ ఏ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే దాన్ని నిర్వ‌ర్తించేందుకు శ్ర‌మించి ప‌ని చేస్తాను’ అన్నారు.

ఇక మ‌హాకూట‌మిపై మాట్లాడుతూ ‘అదొక అప‌విత్ర కూట‌మీ. కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ల‌కు గుర్తింపు లేదు, ఆ పార్టీ అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌టించిన వెంట‌నే తెరాస‌లోకి వ‌చ్చి చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థులు జాబితా విడుద‌ల కాగానే తీవ్ర‌మైన అస‌మ్మ‌తి చెలరేగుతుంది’ అని చెప్పారు.

పార్టీ నుంచి తాను ఏదీ ఆశించి జాయిన్ కాలేద‌ని దానం చెప్ప‌డం విడ్డూరం కాదా.? పార్టీ నుంచి ఆయ‌న ఆశించింది ఏదీ ద‌క్క‌లేద‌న్న‌ది వాస్త‌వం. అల్పసంతోషి కాదు అని చెప్పటంలో ఎమ్మెల్యే టిక్కెట్ కు మించి ఏదయినా ఆశిస్తున్న‌ట్టు సంకేతాలు ఇస్తున్నట్టు కనిపిస్తోంది. నిజానికి, తెరాస‌లో చేరిన‌ప్పుడే ప‌క్కాగా డీల్ కుదుర్చుకుని ఉంటె ఈరోజు ఈ సంజాయిషీలు, వ్యాఖ్యలు చెప్పీ అవసరం ఉండేది కాదు.