అబ్బో…నోట్ల రద్దు వలన ఎన్ని ప్రయోజనాలో…

704

అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు సమీపిస్తున్నాయి అనగా దేశంలో ఉగ్రవాదం పెరిగిపోవడానికి పెద్ద నోట్లే కారణం అనే మహత్తరమైన జ్ఞానోదయం పొటమరించగా, రాత్రికి రాత్రే వెయ్యి, అయిదు వందల నోట్ల కరెన్సీ ని రద్దుచేశారు ప్రధాని మోడీ మహాశయులు. ఇంకేం? రాత్రికి రాత్రే కాశ్మీర్ లోని ఉగ్రవాదులు దేశం విడిచి పారిపోయారు.

ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలకు ముందుగానే రెండువేల రూపాయల కోట్ల నోట్లు కోట్లాదిగా ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ నాయకులకు చేరిపోయాయి. పాపం మాయావతి, అఖిలేష్ వద్ద కాసులు లేకుండా పోయాయి. దాంతో వందలకోట్లు ఖర్చు చేసి బీజేపీ ఉత్తరప్రదేశ్ కోటలో ఎత్తైన పాగా వెయ్యగలిగింది. ఓటర్లకు పంచడానికి డబ్బు లేక మిగిలిన పార్టీలు అన్నీ చిత్తు చిత్తు అయ్యాయి.

రెండుమూడు రోజులపాటు మాయమై పోయింది అనుకున్న ఉగ్రవాదం మళ్ళీ చెలరేగింది. యధావిధిగా ప్రతిరోజూ ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఉగ్రవాదులు చావడం లేదు కానీ, జవాన్లు మాత్రం అమరులై పోతున్నారు.

ఇక ఉన్నట్లుండి చేతిలో ఉన్న డబ్బు మాయమై పోవడంతో పారిశ్రామిక రంగం కుప్ప కూలిపోయింది. బ్యాంకుల్లో నగదు లేదు. ప్రజల పర్సులు ఖాళీ అయ్యాయి. దేశం బాగుపడాలంటే డిజిటల్ చెల్లింపులు మార్గం అన్నారు. జనం మెల్లిమెల్లిగా కార్డు చెల్లింపులకు అలవాటు పడుతున్నారు. కార్డు గీకితే రెండుశాతం మొతం మోగిపోతున్నది. కరెన్సీ రద్దు చేసినా, ఇంధన ధరలు మాత్రం తారాజువ్వల్లా దూసుకుని పోతున్నాయి. నల్లధనం మొత్తం మాయమైపోతుంది ప్రభుత్వం నమ్మబలికినా, ఎన్నికల్లో పార్టీలు వందలకోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. మొన్నటి నంద్యాల ఉపఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ రెండువందల కోట్లరూపాయలకు పైగా ఖర్చు చేసింది. ఈ డబ్బంతా ఎక్కడిది?

నల్లధనం మొత్తాన్ని కక్కిస్తామని వీరప్రతాపాలు పలికారు మోడీ, జైట్లీలు. నోట్లరద్దు తరువాత ఎంత కక్కించారో ఇంతవరకు అంతు చిక్కలేదు. నల్లడబ్బుకు చెక్ పెట్టాలంటే పెద్దనోట్లను రద్దు చెయ్యడం ఒక్కటే మార్గం అని నేనే సూచించాను అని ఘనంగా ప్రకటించుకున్నారు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు. నల్లధన వ్యాప్తికి దోహదపడుతున్న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని చెప్పిన మోడీ ప్రభుత్వం మళ్ళీ వెయ్యి నోట్ల రూపాయలను ముద్రిస్తున్నదిట. మరో రెండు మూడు నెలల్లో వెయ్యి రూపాయల నోట్లు మళ్ళీ వస్తాయి. అనగా గతంలో అయిదు వందలు, వెయ్యి నోట్లు మాత్రమే ఉండగా ఇప్పుడు అదనంగా రెండువేల నోట్ల నోటు కూడా చేరింది. అంతే కాకుండా రెండువందల రూపాయల నోటు చేరింది. అదేమంటే వందకు అయిదు వందలకు మధ్య చిల్లర కోసమట. వెయ్యి నోటు ఎందుకంటే అయిదు వందలకు, రెండు వేలనోట్ల నోటు కు మధ్య చిల్లర కోసమట…ఏమి తెలివండీ… మరి అయిదు వందలు, వెయ్యి రద్దు చేసేటపుడు, అయిదువందల తరువాత నేరుగా రెండువేల నోటు ముద్రించేటపుడు ఈ తెలివి ఏమైంది?

demonetization brought benefits to BJPఅబ్బో…నోట్ల రద్దు వలన ఎన్ని ప్రోయోజనాలో…

మొత్తానికి కొండను తవ్వారు. కానీ ఎలుకపిల్లని కూడా పట్టలేకపోయారు. దేశప్రజలతో మోడీ ఆడిన ఆర్ధిక జూదము ఘోరంగా విఫలమైందని రుజువైంది. రద్దు చేసిన పెద్ద నోట్ల విలువతో తొంభై తొమ్మిది శాతం అసలు కరెన్సీ తిరిగి బ్యాంకులకు తిరిగి వచ్చేసిందిట. మరి నల్లధనం ఎక్కడుంది?

ఇందుకేనా వందమంది ప్రాణాలు తీసింది?
బ్యాంకుల్లో నగదు లేకుండా చేసింది?
ఆర్థిక రంగాన్ని సర్వనాశనం చేసింది?
ఒక్క నల్ల కుబేరుడిని పట్టుకున్నారా?
ఒక్క రూపాయి నల్లడబ్బును రికవరీ చెయ్యగలిగారా?
కాశ్మీర్ లో ఉగ్రవాదులు పోయారా?

అంతా భయంకరమైన మోసం. పెద్దనోట్లు రద్దుచేసి ఇంకా పెద్దనోట్లు తెచ్చారు. రెండువేల రూపాయల నోటు ఎవరికోసం? ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవడానికి సులభంగా ఉండటానికేగా? అయిదు వందల నోటు మళ్లీ వచ్చింది. వెయ్యి రూపాయల నోటు మళ్లీ రాబోతుంది. మరి ఉగ్రవాదం మాత్రం తిరిగి రాదా?

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆర్థికవేత్తలు అందరూ నోట్లరద్దును తప్పు పట్టారు. అదే వాస్తవమైంది. ఇదొక దుర్మార్గపు ప్రయోగం. మోడీ ఒక వ్యాపారి. ఆయన లక్ష్యం ఒక్కటే. ప్రజలందరినీ డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించి ఆ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు కమీషన్ రూపంలో దోచిపెట్టాలి. దానిలోనుంచి తమ వాటాలు కైంకర్యం చెయ్యాలి. అలాగే ఉత్తరప్రదేశ్ లో గెలవడం మోడీ లక్ష్యం. దానికోసం ఆయన దేశం మొత్తాన్ని సర్వనాశనం చెయ్యడానికి తెగించారు. ఇంతే సంగతులు.. చిత్తగించవలెను.

చివారాఖరికి నోట్ల రద్దు వలన ఏమి ఒరిగింది? వంద, అయిదువందల నోటు మధ్యలో రెండు వందల నోటు చేరింది. వెయ్యి నోటు కంటే పెద్దదైన రెండువేల నోటు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో భాజపా గెలిచింది. సామాన్యుడు అష్ట కష్టాలు పడ్డాడు. ఉగ్రవాదం అలాగే ఉన్నది. నల్లధనం అలాగే ఉన్నది.

ఈ కుంభకోణం బయటపడడానికి సమయం పడుతుంది.

– ఇలపావులూరి మురళీ మోహన రావు