తెరాసలో తిరుగుబాటు మొదలైందా.?

48

తెలంగాణ రాష్ట్ర సమితిపై కొండా దంపతులు తిరుగుబాటు చేసారు. పార్టీ కోసం కష్టపడిన తమ టికెట్ విషయం పెండింగ్‌లో పెట్టడం తమను అవమాన పరచడమేనని, కారణమేమిటో చెప్పాలని డిమాండ్ చేసారు.

కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో కొండా సురేఖ పేరు లేదు. టికెట్‌ను పెండింగ్‌లో పెట్టారు. ఈ విషయంపై తీవ్ర మనస్థాపానికి గురైన కొండా దంపతులు తిరుగుబాటుకే నిర్ణయించుకున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తమను పొమ్మనకుండానే పొగ పెట్టారని నేరుగా ఆరోపించారు. చాలా రోజులుగా మంత్రి కేటీఆర్ తమకు వ్యతిరేకంగా  ఇతర నేతల్ని పొత్సహిస్తున్నారని మండి పడ్డారు.

భూపాలపల్లిలో మధుసూదనాచారిపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన గెలవరని తమ కుమార్తె పేరును పరిగణనలోకి తీసుకోవాలని మాత్రమే కోరినట్లు కొండా సురేఖ చెప్పారు. ఎంపీగా ఉన్న బాల్కసుమన్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్నారు. గత ఎన్నికలకు ముందు కొండా దంపతుల్ని టీఆర్ఎస్‌లోకి తీసుకు రావడంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి పార్టీలో ఏ సమస్య వచ్చినా హరీష్ వద్దకే వెళ్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై కొండా దంపతులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసి గెలిచే సత్తా ఉందన్నారు. కొండా సురేఖ రాజకీయంగా చాలా బలమైన వ్యూహంతోనే టీఆర్ఎస్‌ను ఢీకొడుతున్నారు. మహిళలకు నాలుగు టిక్కెట్లు మాత్రమే కేటాయించడాన్ని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడిన మహిళలకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ కల్వకుంట్ల కుటుంబజాగీరు కాదన్నారు. చివరిగా కేసీఆర్ విశ్వసనీయతను ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేసారు.