ఏం చెప్పారు మంత్రి గారూ ..ఎప్పుడూ ఇలాగే చెప్తారా.?

374

నంద్యాల ఉపఎన్నిక ఓటమితో వైకాపా ఫిరాయింపుదారుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. వైకాపా నుంచి తేదేపాలో చేరిన 20 మందితో రాజీనామాలు చేయించాల‌ని వైకాపా నేత‌లు స‌వాళ్ళు విసురుతున్నారు. దీనికి తెదేపా నుంచి కూడా ధీటైన ప్ర‌తి స‌వాళ్ళు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్య‌లు చేసారు.

తెదేపా శాస‌నస‌భ్యులు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌నీ, ఎన్నిక‌ల‌కు వెన‌కాడ‌టం లేద‌న్నారు. గెలవ‌లేమ‌న్న భ‌యంతోనే రాజీనామాలు చేయ‌కుండా ఉన్నామ‌నుకోవ‌డం పొర‌పాట‌న్నారు. ఎన్నిక‌ల పేరుతో అన‌వ‌స‌రంగా ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేయ‌డం ఎందుకు? ఎల‌క్ష‌న్ కోడ్ వ‌ల్ల ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు న‌ష్టం జ‌రుగుతుంది. స‌మ‌యం వృథా అవుతుంది. దాని వ‌ల్ల నీకొచ్చిన లాభ‌మేందీ? 20 మంది శాస‌నస‌భ్యుల‌తో రాజీనామాలు చేయించి ఎన్నిక‌ల‌కు పోతే, నువ్వేమైనా ముఖ్య‌మంత్రివి అవుతావా? 20 మంది గెలిచినా నువ్వు ముఖ్య‌మంత్రివి కావు క‌దా. రాజీనామాల గురించి మాట్లాడ‌టం ఎందుకూ’ అంటూ జ‌గ‌న్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్ర‌జాధ‌నం దుర్వినియోగం అనే ఒకేఒక్క కార‌ణంతో, ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తే అభివృద్ధికి ఆటంకం క‌లుగుతుంద‌నే ఆలోచ‌న‌తోనే రాజీనామాలు చేయ‌డం లేద‌ట‌. ఫిరాయింపుదారుల‌ను వెన‌కేసుకుని రావ‌డం కోసం ఇలాంటి లాజిక్ ఒక‌టి ఉంటుంద‌ని అమ‌ర్ నాథ్ రెడ్డి చెప్ప‌డం వింతగా ఉంది. అయినా, ప్ర‌జ‌లూ ప్ర‌జాధ‌నం, ప్ర‌జాసేవ లాంటి బాధ్య‌తాయుత‌మైన ఆలోచ‌న‌లే నిజంగానే ఉంటే ఆ ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును వెక్కిరిస్తూ ఫిరాయింపుల‌కు ఎవ‌రైనా పాల్ప‌డ‌తారా.?