కార్డులతో చెల్లిస్తే తడిసి ‘మోపెడు’

496

ఏటీఎంల నుంచి గానీ… బ్యాంకుల నుంచి గానీ నగదు విత్‌డ్రా చేసే పరిస్థితి లేదు. నెట్ అంటే తెలియని వారు, మొబైల్‌లో నెట్ లేనివారు గతిలేక ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తుంటే… తెలిసినవారంతా విధిలేక ఇంటర్నెట్ ఆర్థిక లావాదేవీలవైపు మళ్ళుతున్నారు.

మరోవైపు ప్రభుత్వమేమో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్ చేయండి ..డిజిటల్ లావాదేవీలు చేయండంటూ విపరీతంగా ఊదరగొడుతూ -డిసెంబర్ 31 వరకూ అన్ని డిజిటల్ ఆర్ధిక లావాదేవీలపైనా ఛార్జీల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే పరిస్థితి మరోలా ఉంది,  సినిమా టికెట్ల నుంచి విమాన టికెట్ల దాకా అన్ని బ్యాంకింగ్ వ్యవస్థలూ చార్జీల్ని వసూలు చేస్తూనే ఉన్నారు.

digital-payments

ఈ నేపధ్యంలో అసలు కార్డు, ఆన్‌లైన్ లావాదేవీల్లో ఛార్జీలపై అవలోకనం ..

ఆన్‌లైన్‌లో బ్యాంకుల ద్వారానో యాప్ ద్వారానో సినిమా టికెట్లు చేస్తే సర్వీస్ చార్జీలు, ఇతరత్రా పన్నుల పేరిట ఒకో టికెట్‌పై రూ.20 నుంచి 40 వరకూ వసూలు చేస్తున్నారు. పెట్రోల్ పోయించుకుంటే బిల్లు మొత్తంలో 2.5 శాతాన్ని వసూలు చేస్తున్నారు..క్రెడిట్ కార్డుతోనే కాదు డెబిట్ కార్డుతో చెల్లించినప్పుడు కూడా సర్‌చార్జీలు, సర్వీస్ ఛార్జీల పేరిట 0.75-1 శాతం దండుకుంటున్నారు. ఈ అదనపు చార్జీల్ని ఎత్తివేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఆచరణలోకి రాలేదు.

పండ్లు, కూరగాయలకు కూడా డిజిటల్ చెల్లింపులు చేయాలంటే వివిధ చార్జీల రూపంలో 5-30 శాతం అధికంగా కట్టడానికి సిద్ధపడాలి. లైన్లో నిల్చుని తీసుకున్న రైలు టికెట్ కన్నా.ఆన్‌లైన్లో తీసుకునే టికెట్ ఖరీదు కాస్త ఎక్కువ. ఎందుకంటే సర్వీసు ఛార్జీలు, బ్యాంకు ఛార్జీలు అన్నీ కలిసి తడిసి మోపెడవుతుంది. క్రెడిట్ కార్డు ద్వారా విమానం టికెట్లు కొంటే టికెట్‌కు రూ.150 చొప్పున అదనంగా చెల్లించాలి.

ఇప్పటికీ భారత్ ప్రధానంగా నగదు లావాదేవీలపైనే ఎక్కువగా ఆధారపడిన దేశం. దేశీయంగా వినియోగదారులు జరిపే లావాదేవీల్లో పరిమాణంపరంగా 95 శాతం, విలువపరంగా 65 శాతం నగదు రూపంలోనే ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెలామణీలోని నగదులో 86 శాతం పైగా వాటా ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఆన్‌లైన్ లావాదేవీలు అత్యంత సులభతరమైనవంటూ ఊదరగొడుతున్నవారు నగదు లావాదేవీలతో పోలిస్తే ఇవి మరింత ఖరీదైనవన్న సంగతి మాత్రం చెప్పడం లేదు.