ఉపఎన్నికల విషయంలోనూ దొరికిపోయారు

140

తాను చేస్తున్న పనుల గురించి ఎన్నికల సంఘం వివరణలు ఇచ్చుకోవడానికి నానా తంటాలు పడుతోంది. రాజస్థాన్ లో ప్రెస్ మీట్ ను మూడు గంటల పాటు వాయిదా వేయడంపై తీవ్ర విమర్శలు వస్తే కుంటి సాకులు చెప్పింది. వాటిని చూసి నెటిజన్లు నవ్వుకున్నారు.

కర్ణాటకలో మూడు పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఏపీలో ఖాళీగా ఉన్న ఐదు లోక్ సభ స్థానాలను ప్రకటించకపోవడంపైనా విమర్శలు వచ్చాయి. భాజపా చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శలు రావటంతో ఈసీ కొత్తగా వివరణ ఇచ్చింది. కర్నాటకలోని బళ్ళారి, షిమోగ, మాండ్య లోక్‌సభ స్ధానాలు మే 18, మే 21 తేదీల నాటికే ఖాళీ అయ్యాయని, ఆంధ్రప్రదేశ్‌లోని 5 లోక్‌సభ స్ధానాలు జూన్‌ 20న ఖాళీ అయ్యాయని తెలిపింది.

ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్‌ 151ఏ ప్రకారం పదవీ కాలపరిమితి ఏడాది కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాలని, 16వ లోక్‌సభ కాలపరిమితి 2019 జూన్‌ 3వరకూ మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది. నిజానికి ఏడాది కాలపరిమితి అనేది ఈసీ విచక్షణ మీద ఆధారపడి ఉందని, నిర్వహించాలనుకుంటే నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వాస్తవానికి కర్ణాటకలో మూడు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించినా ఎన్నికయ్యే వారి పదవీకాలం ఆరు నెలలే. ఏపీలో ఉపఎన్నికలు నిర్వహించినా పదవీకాలం ఆరు నెలలే. వైకాపా ఎంపీలు చాలా ముందుగానే రాజీనామా లేఖలు స్పీకర్ కు ఇచ్చారు. ఏడాది గడువు తర్వాత ఒక్క రోజు ముగియగానే ఆమోదించారు. కర్ణాటకలో ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఈసీ విశ్వసనీయతకే మచ్చ వచ్చి పడింది.