‘తెలుగమ్మాయి’కి అవకాశాలు బాగానే వస్తున్నాయి

103

ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల కాంబో ‘అర‌వింద స‌మేత’ చిత్రంలో తెలుగమ్మాయి ఈషారెబ్బా చేసిన పాత్ర చిన్న‌దే అయినా కానీ హిట్ సినిమాలో క‌నిపించింది కాబ‌ట్టి హిట్‌ని ఖాతాలో వేసుకుంది. ‘అంతకు ముందు ఆ తరవాత’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ వరంగల్ అమ్మాయికి అవకాశాలు బాగానే వచ్చాయి. ‘అరవింద సమేత’తో ఆమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిందనే చెప్పాలి.

రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ #RRR లోనూ, ఎన్టీఆర్ బ‌యోపిక్‌లోనూ ఈషాకి అవకాశం ద‌క్కింద‌ని వార్త‌లొచ్చాయి. వీటిపై ఈషా స్పందిస్తూ ‘#RRR లో అవ‌కాశం వ‌స్తే అంత‌కంటే కావాల్సింది ఏముంది? నిజంగా అలాంటి ప్ర‌తిపాదన వ‌స్తే నేనే ముందు చెబుతా. ఎన్టీఆర్ బ‌యోపిక్ గురించి మాత్రం న‌న్ను అడ‌గొద్దు. చిత్ర‌బృంద‌మే ఈ విష‌యాన్ని ఖ‌రారు చేస్తుంది’ అని చెప్పింది.

‘అర‌వింద స‌మేత‌’లో పాత్ర చిన్న‌దా, పెద్ద‌దా అని ఆలోచించ‌లేదు. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్‌ల సినిమా కాబట్టి ఒప్పుకున్నా. నా కెరీర్‌కి ఎంత ఉప‌యోగ‌ప‌డుతుంది అని కూడా ఆలోచించ‌లేదు. చాలా సంతోషంగా చేసా. నా పాత్ర నిడివి త‌క్కువ ఉంద‌న్న బాధ కూడా లేదు. ఎందుకంటే అది ఎన్టీఆర్ సినిమా. జ‌నాలు ఎన్టీఆర్‌ని చూడ్డానికి వ‌స్తారు. నా కోసం రారు’ అని చెప్పింది.

ఆమె సుమంత్ తో కలిసి నటించిన ‘సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘నాకు థ్రిల్లర్స్ చాలా ఇష్టం. ఇదొక థ్రిల్లర్ అని సంతోష్ నాకు చెప్పారు. వాస్తవానికి ముందు నాకు ఒక మెయిల్ చేశారు. ఆ తరవాత నేను ఆయన్ని ఒక కాఫీ షాప్‌లో కలిసాను. రెండు గంటల పాటు స్టోరీ మొత్తం నెరేట్ చేసారు. ఆయన స్టోరీ చెబుతున్నప్పుడే నేను విజువలైజ్ చేసుకున్నాను. చాలా నచ్చింది. అందుకే ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పాను. ఇలాంటి పాత్ర ఇప్పటి వరకు నేను చేయలేదు’ అని చెప్పింది.