త్వరలోనే ఎన్నికల తేదీలు ప్రకటిస్తారా.!

1589

మార్చి మొదటి వారంలో ఎన్నికల ప్రకటన రాబోతోందని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనధికారిక సూచన వచ్చిందని అంటున్నారు. అసెంబ్లీల కాలపరిమితి ముగియబోతున్న నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ఈసీ వర్గాలు కూడా చెపుతున్నాయి.

గత రెండు, మూడు సార్లు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి మొదటి వారంలో విడుదలయింది. అలా విడుదల చేస్తేనే దేశవ్యాప్తంగా సమయానికి ఎన్నికలు నిర్వహించగలుగుతారు. ఎన్నికల సంఘం రాజ్యాంగం ప్రకారం స్వతంత్రమైన సంస్థ కానీ కేంద్రప్రభుత్వం చేతుల్లో కీలు బొమ్మగా మారిందని ఇప్పటికే అనేక సార్లు రుజువైంది. తాజాగా ఇప్పుడు భాజపాకి అనుకూలంగా ఉండేలా ఎన్నికల ప్రకటన కొంత మందుగానే విడుదల చేయవచ్చన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది.

రైతుల కోసం, మధ్యతరగతి కోసం కేంద్రం తాయిలాలు సిద్ధం చేస్తున్న తరుణంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేలా చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. విపక్ష పార్టీలు ఇంకా సమైక్యం కాకపోవటంతో గందరగోళంలో విపక్షాలు ఉండగానే పని చక్కబెట్టుకోవాలని భాజపా భావిస్తోందని అంటున్నారు.

కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల అధికారుల్ని మార్చేయడం, సుదీర్ఘంగా పని చేస్తున్న అధికారుల్ని బదిలీ చేయాలని రాష్ట్రాలను ఆదేశించడంతో ఈసీ ఓ ప్లాన్ ప్రకారమే చేస్తోందన్న అభిప్రాయం వెల్లడయింది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల ప్రకటన రావొచ్చని అంటున్నారు.