రివ్యూ : ‘కళ్యాణం’ మాత్రమే ఉంది

158

శతమానం భవతి సినిమాతో హిట్ సాధించిన దర్శకుడు సతీష్ వేగేశ్న ‘శ్రీనివాస కళ్యాణం’తో వచ్చారు. తెలుగింటి సాంప్రదాయాలు, పెళ్ళివిలువలు ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేసారు. నితిన్ రాశీఖన్నాలతో ఆయన తీసుకొచ్చిన శ్రీనివాస కళ్యాణం ప్రేక్షకులను ఆకట్టుకుందా.? చూద్దాం.

కథేమంటే..

ఉమ్మడి కుటుంబంలో పెరిగిన శ్రీనివాస రాజు (నితిన్) చిన్నప్పటి నుంచి నాన్నమ్మ (జయసుధ) చెప్పిన మాటలు వింటూ పెళ్ళిని పండుగలా చేసుకోవాలనుకుంటాడు. చంఢీఘడ్ లో ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌ ఆర్కే గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్  ఆర్కే (ప్రకాష్ రాజ్‌) కూతురు శ్రీదేవి (రాశీ ఖన్నా) ప్రేమించుకుంటారు. శ్రీనివాస్ పెళ్ళి విషయాన్ని ఆర్కే ముందు ఉంచుతాడు.  ప్రేమ, పెళ్ళి లాంటి విషయాలను బిజినెస్ లా చూస్తూ ప్రతి నిమిషాన్ని డబ్బుతో లెక్కగట్టే ఆర్కే శ్రీనివాస్‌, శ్రీదేవిల పెళ్ళికి ఒక షరతుతో అంగీకరిస్తాడు. శ్రీనివాస్ కూడా ఎదురు షరతు పెట్టి ఆర్కే షరతుకు ఒప్పుకుంటూ అగ్రిమెంట్ చేస్తాడు. వారిద్దరి మధ్య జరిగిన షరతులు ఏమిటి.? ఆ షరతుల వల్ల శ్రీను కుటుంబంపై ఎలాంటి ప్రభావం పడింది. శ్రీను, శ్రీల పెళ్ళికి షరతులే ఆడుగా నిలిచాయా.? లాంటి విషయాలన్నీ వెండితెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

‘శతమానం భవతి’ సినిమాతో యువ ప్రేక్షకులను కూడా ఫ్యామిలీ సినిమాకు రప్పించేలా చేసిన సతీష్‌ వేగేశ్న ఈసారి నేటి తరానికి సంప్రదాయాలు, పెళ్ళి విశిష్టతను చెప్పే ప్రయత్నం చేసాడు. అయితే ఆ అంచనాలు అందుకోవటంలో ఫెయిలయ్యాడు.  పెళ్ళి నేపథ్యంలో కథను తయారు చేసుకున్నా ఆ కథను హృద్యంగా మనసును తాకేలా తీయలేకపోయాడు. ఫస్ట్‌ హాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు ఇంకాస్త కొత్తగా, బలంగా ఉండాల్సింది. సెకండ్‌ హాఫ్ లో పెళ్ళిపనులు మొదలయ్యాక కథాగమనం మరింత నెమ్మదించింది. కామెడీ, ఎమోషన్స్‌ పండించే అవకాశం ఉన్నా వాడుకోలేదు. పద్మావతి పాత్రను మరింత బలంగా చూపించే అవకాశం ఉన్నా ఎందుకో పట్టించుకోలేదు అనిపిస్తుంది. ఆమె తన ప్రేమను త్యాగం చేసిందని హీరోకి చెప్పే సీన్ సింపుల్ గా తేలిపోతుంది. ఇపుడు అసలు ఎందుకు చెప్పాలి అనిపిస్తుంది. ఎడిటింగ్ లో కొన్ని సీన్లు తీసేసారేమో అనిపిస్తుంది. పూనం కౌర్ పాత్రను చివర్లో వాడుకుని హీరోయిన్, ఆమె తండ్రి, హీరో, కుటుంబాల మధ్య సంఘర్షణ చూపించి ఉంటే నిర్మాతలు ముందు నుండి చెపుతున్నట్లుగా ‘బొమ్మరిల్లు’ అంతటి ఫ్లేవర్ వచ్చేదేమో. సినిమా మొదట్నుండీ ఎక్కువగా పెళ్ళి ఎలా జరిపిస్తారు. పెళ్ళి గొప్పతనం ఏమిటో చెప్పటానికే ప్రయత్నించటం మైనస్ పాయింట్. అయితే పెళ్ళిమంత్రాల్లోని అంతరార్థం చెప్పే డైలాగ్స్‌తో పాటు మరికొన్ని చోట్ల బరువైన సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఇక సంగీతం విషయానికొస్తే ఒక్క పెళ్ళి పాట తప్ప మరే పాట మెప్పించేలా లేదు.

ఎవరెలా..

సంప్రదాయాలు, కుటుంబ బంధాలను గౌరవించే పాత్రలో కనిపించిన నితిన్‌ ఎమోషనల్‌ సీన్స్‌లో మెప్పించాడు. శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా ఒదిగిపోయింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. పద్మావతిగా నందిత శ్వేతకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కిందనే అనుకోవాలి. మిలియనీర్ బిజినెస్‌మేన్‌గా ప్రకాష్ రాజ్‌ మరోసారి ఆకట్టుకున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, జయసుధ, సితార, విద్యుల్లేఖ రామన్‌, ప్రవీణ్ రొటీన్‌ పాత్రల్లో కనిపించారు.

ఫైనల్ గా..

‘కళ్యాణం’తో పాటు కథపై కూడా దృష్టి పెట్టాల్సింది.