‘రూపాయి’ కోసం ప్రవాసుల సాయం కోరుతున్నారు

278

దేశీయ కరెన్సీ రూపాయి పతనం శరవేగంగా సాగుతోంది. నిన్నమొన్నటిదాకా రోజుకు 2 లేదా 3 పైసల స్థాయిలో పడుతూ ఉండే రూపాయి ఇప్పుడు ఏకంగా రోజుకు రూపాయి తేడా స్థాయికి వచ్చింది.

రూపాయి పతనాన్ని ఊహించినప్పుడే కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే రీతిలో రూపాయి పతనం సాగుతోంది. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా రూపాయి పతనాన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో ప్రవాసుల సాయం తీసుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇతర దేశాల్లో స్థిరపడ్డ భారతీయుల నుండి పెద్దయెత్తన డాలర్లను సేకరించడం ద్వారా రూపాయికి విలువ పెంచాలని ఆలోచిస్తోంది.

2013లో రూపాయి పతనం శరవేగంగా ఉన్నప్పుడు అప్పటి ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. డాలర్లలో చెల్లించాల్సిన దిగుమతుల్ని తగ్గించి బంగారం కొనుగోళ్ళపై ఆంక్షలు విధించారు. ఎన్నారైల దగ్గర్నుంచి డాలర్ల సేకరణ కోసం పెట్టుబడి పథకం ప్రవేశ పెట్టారు. ఇప్పుడు మిగతా వాటిని పెద్దగా పట్టించుకోని కేంద్రం వారి వద్ద ఉన్న డాలర్లను స్వదేశానికి తీసుకు రమ్మని అడుగుతోంది.

రూపాయి విలువ పడిపోతున్న నేపధ్యంలో బంగారం విలువ అమాంతం పెరిగింది. బులియన్‌ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ పెరిగింది. బంగారానికి గ్లోబల్‌గా డిమాండ్‌ లేనప్పటికీ, దేశీయంగా మాత్రం రివర్స్‌ ట్రెండ్‌ నమోదైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణత ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. డిచమురు ధరలు తగ్గే సూచనలు కూడా సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు.