జగ్గారెడ్డి అరెస్టుతో రాజకీయ కలకలం

438

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని నిన్న ఆర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసారు. పటాన్‌చెరులో సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు జగ్గారెడ్డిని పట్టుకుపోయారు.

పధ్నాలుగేళ్ళ కిందట జగ్గారెడ్డి మనుషుల అక్రమ రవాణా చేసారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెపుతున్నారు. పధ్నాలుగేళ్ళ కిందట జగ్గారెడ్డి భార్యాపిల్లల పేరుతో ముగ్గురు గుజరాతీయుల్ని అమెరికాలో వదలి పెట్టి వచ్చారనేది ఆరోపణ. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం దుమారం రేపుతోంది. జగ్గారెడ్డిని అరెస్ట్ చేసిన సమాచారం తెలిసిన వెంటనే సంగారెడ్డి జిల్లా మొత్తం బంద్ పాటిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సభ నిర్వహించాలన్నా జగ్గారెడ్డి ముందుంటారు. కొద్ది రోజుల కిందట రాహుల్ గాంధీ సభను నిర్వహించడానికి కోమటిరెడ్డి లాంటి వారు వెనుకడుగు వేస్తే సంగారెడ్డిలో తాను బాధ్యత తీసుకుని సభ పెట్టించారు. ఎన్నికలు ఖాయం అని తేలిన తర్వాత ఇప్పుడు మరో సభ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్న సమయంలో జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.

వాస్తవానికి పుష్కరం కిందట ప్రజాప్రతినిధులు కొందరు మనుషుల్ని అక్రమ రవాణా చేసారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఎక్కువగా ఉత్తరాది ప్రజాప్రతినిధులపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెరాస సభ్యులపైనా ఆరోపణలు వచ్చాయి. ఆలె నరేంద్రను పార్టీ నుంచి బహిష్కరించడానికి కేసీఆర్ ఈ ఆరోపణలను వాడుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా జగ్గారెడ్డిపై కేసు పెట్టి ఏకంగా అరెస్ట్ చేసేసారు.