రివ్యూ : ‘దేవదాస్’లు ఓకే అనిపిస్తారు

180

సీనియర్‌ హీరో నాగార్జున, నాని కాంబినేషన్‌ లో తెరకెక్కిన మల్టీస్టారర్‌ ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో అశ్వనీదత్‌ స్వయంగా నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాకు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. మల్టీస్టారర్‌గా తెరకెక్కిన దేవదాస్‌ సక్సెస్‌ అయ్యిందా? నాగ్‌,నానిల కాంబినేషన్ ఏ మేరకు అలరించింది? చూద్దాం.

కథేమంటే..

అజ్ఞాతంలో ఉండే మాఫియా డాన్ దేవ (నాగార్జున) తనను ఆదరించి పెంచిన దాదా(శరత్‌ కుమార్‌)ను ప్రత్యర్థులు చంపేయటంతో బయటకు వస్తాడు. దీనితో ఎలాగైన దేవాను పట్టుకోవాలని పోలీసులు, దాదాను చంపిన డేవిడ్‌ (కునాల్ కపూర్‌) గ్యాంగ్ ప్రయత్నిస్తుంటారు. పోలీసుల అటాక్‌లో గాయపడిన దేవకు డాక్టర్‌ దాస్‌ (నాని) ట్రీట్‌మెంట్‌ చేస్తాడు. క్రిమినల్‌ అని తెలిసినా పోలీస్‌లకు పట్టివ్వని దాస్‌ మంచితనం చూసి, దేవ అతనితో స్నేహం చేస్తాడు. దాస్‌ కూడా దేవకు మంచి ఫ్రెండ్ అయిపోతాడు. పూజ (ర‌ష్మిక‌)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు దాస్‌. యాంక‌ర్ జాహ్న‌వి (ఆకాంక్ష) అంటే దేవ‌కి చాలా ఇష్టం. మనుషులను చంపటం తప్ప ప్రేమించటం తెలియని దేవ మనుషులను అమాయకంగా నమ్మటం, ప్రేమించటం మాత్రమే తెలిసిన దాస్‌ల మధ్య కుదిరిన స్నేహం ఏ మలుపు తీసుకుంది? వారి ప్రేమకధలు ఏమయ్యాయి? అనేదే మిగిలిన కధ.

ఎలా ఉందంటే..

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ‘దేవదాస్‌’ను బాగానే డీల్ చేసాడు. కథనం మాత్రం పడుతూ లేస్తూ సాగుతుంది. నాగ్‌, నానిలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడు. ఫస్ట్‌ హాఫ్ దేవ, దాస్‌ల మధ్య ఫ్రెండ్‌షిప్‌, కామెడీ ఆకట్టుకున్నా ప్రేమకథలు ఆసక్తికరంగా లేకపోవటం నిరాశకలిగిస్తుంది. డాన్ కోసం పోలీసులు వెదక‌డం, డాన్ ఓ చోట దాక్కోవ‌డం ఇదివ‌ర‌క‌టి సినిమాల్లో చూశాం. దానికి రాజ్ కుమార్ హీరాణీ టైపు ట్రీట్‌మెంట్‌ తో క‌థ‌కి కొత్త ఫ్లేవ‌ర్ అద్దే అవ‌కాశం వ‌చ్చింది. దేవ‌, దాసు ఇద్ద‌రూ క‌లిసే వ‌ర‌కూ సినిమా కాస్త గంభీరంగా సాగుతుంది. దేవ‌, దాసు క‌లిసాక ఫ‌న్ మొద‌ల‌వుతుంది. నాగ్‌, నానిల కెమిస్ట్రీ అలా కుదిరేసింది. రెండు త‌రాల హీరోలు క‌లిసి మందు కొట్ట‌డం, ల‌వ్ స్టోరీల గురించి చెప్పుకోవ‌డం, దేవ ఫోన్ చేస్తే ఆ ఫోన్లోనే దాసు ముద్దుల గురించి వివ‌రించ‌డం, అస‌లు ఇద్ద‌ర్నీ అలా ప‌క్క ప‌క్క‌న చూస్తుండిపోవాల‌నిపిస్తుంది. నాని, నాగ్‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా లాజిక్ లెస్‌గా, బోరింగ్ అనిపిస్తుంటుంది. డాన్ రోడ్లపై ద‌ర్జాగా తిరిగేస్తుంటాడు, పోలీసుల ముందు నుంచే వెళ్తుంటాడు కానీ ప‌ట్టుకోరు. దాసు క్లినిక్‌లోనే ప‌ట్టుకోవాలి అని రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం కాస్త కామెడీ ట‌చ్ ఇచ్చి జాలీ మూడ్‌తో ముగించటం ఓకే అనిపిస్తుంది. నాని ఆసుప‌త్రి సీన్ల‌న్నీ ‘మున్నాభాయ్‌’కి స్ఫూర్తి అనిపిస్తాయి. సినిమాను డాన్ క‌థ‌గా న‌డ‌పాలో? స్నేహం చూపించాలో? కామెడీతో న‌డిపించేయాలో? ద‌ర్శ‌కుడు తేల్చుకోలేక‌పోయాడు. అందుకే ఏ విభాగానికీ సంపూర్ణ న్యాయం జ‌ర‌గ‌లేదు.

ఎవరెలా..

నాగార్జున మరోసారి మెస్మరైజ్‌ చేసాడు. యంగ్‌గా కనిపిస్తూ యాక్షన్‌, రొమాన్స్‌లతో పాటు కామెడీతోనూ ఆకట్టుకున్నాడు. ఫుల్‌ ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌తో అలరించాడు. నాని తనదైన నేచురల్ పర్ఫామెన్స్‌ తో మెప్పించాడు. అమాయకుడిగా కనిపిస్తూనే మంచి టైమింగ్‌తో కామెడీ పండించాడు. సినిమా అంతా దేవ, దాస్‌ల చుట్టూనే తిరగడంతో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేదు. ఉన్నంతలో ఆకాంక్ష సింగ్, రష్మికలు అందంగా ఆకట్టుకున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్‌ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. నరేష్‌, వెన్నెల కిశోర్‌, సత్య, మురళీశర్మ, అవసరాల శ్రీనివాస్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

ఫైనల్ గా..

ఇద్దరు హీరోలు అనుకోకుండా వెళ్తే ‘దేవదాస్’లు పర్లేదు అనిపిస్తారు. ఏం అనుకోకుండా వెళితే ఎక్కువ నచ్చుతారు.