‘గద్దర్’ స్వతంత్రుడిగానే బరిలోకి దిగుతున్నారట.!

262

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్‌ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగానే ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతున్నారు.  కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ నుంచే  పోటీ చేస్తాన‌న్నారు. ఇదే విష‌యాన్ని కొన్ని రోజుల కింద‌టే గ‌ద్ద‌ర్ ప్ర‌క‌టించారు. http://www.telugupunch.com/gaddar-to-contes…endent-in-gajwel/

ఈ నేప‌థ్యంలో గ‌ద్ద‌ర్ కి మ‌హాకూట‌మి మ‌ద్ద‌తు ఇస్తుంద‌నీ, త‌ద్వారా కేసీఆర్ మీద గ‌ద్ద‌ర్ చేసే విమ‌ర్శ‌ల్ని ఎన్నిక‌ల్లో ప్ర‌చారాస్త్రాలుగా వాడుకోవ‌చ్చ‌ని విశ్లేషణలు వినిపించాయి. ఆ త‌రువాత‌ త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ గ‌ద్ద‌ర్ స్వ‌యంగా కాంగ్రెస్ నుగానీ, మ‌హాకూట‌మి ప‌క్షాల‌ను గానీ, లేదా భాజ‌పాని కోర‌లేదు. అవ‌కాశం ఉంద‌ని తెలిసినా కూడా గ‌ద్ద‌ర్ త‌న కుమారుడి సీటు వ్య‌వ‌హారం కారణంగా కాంగ్రెస్ ను సంప్ర‌దించ‌లేదని తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి త‌న కుమారుడిని ఎన్నిక‌ల బ‌రిలోకి దింపాల‌ని చివ‌రి వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌య‌త్నించిన‌ట్టు స‌మాచారం. అయితే, ఆయ‌న ప్ర‌య‌త్నాన్ని కాంగ్రెస్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేక‌పోయింద‌నీ, ఆశావ‌హుల తాకిడి ఎక్కువ కావ‌డంతో టికెట్ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు స‌మాచారం. దీంతో గ‌ద్ద‌ర్ కాంగ్రెస్ మీద కొంత అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. పైగా గ‌ద్ద‌ర్ గజ్వేల్ నుంచి మాత్ర‌మే పోటీ చేస్తానన‌డంతో ద‌గ్గ‌ర చేసుకునే ప్ర‌య‌త్నం కాంగ్రెస్ చెయ్య‌లేద‌ని అంటున్నారు.

గజ్వేల్ నుంచి పార్టీ త‌ర‌ఫున ప్ర‌తాప‌ రెడ్డి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్నార‌నీ, ఆయ‌న‌తో పోల్చుకుంటే గ‌ద్ద‌ర్ ప్ర‌భావం వాస్త‌వ రూపంలో క్షేత్ర‌స్థాయిలో పెద్ద‌గా ఉండక‌పోవ‌చ్చ‌నే అభిప్రాయం కూడా కాంగ్రెస్ లో వ్య‌క్త‌మైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జా గాయ‌కుడిగా గ‌ద్ద‌ర్ కి పేరుంటే అది ప్ర‌చారానికి మాత్రమే ప‌నికొస్తుంద‌నీ లెక్క‌వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైతేనేం గ‌ద్ద‌ర్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్నారు.