గద్దర్ పిలుపుకు పవన్ స్పందిస్తారా.?

374

ప్ర‌ముఖ ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్ మావోయిస్టు పార్టీ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌, సొంతంగానే ప్ర‌జా పోరాటాలు చేయాల‌నే ఉద్దేశంలో ఉన్న‌ట్టు చెప్పారు. అయితే, ప్ర‌త్యామ్నాయ వేదిక ఇంకా స‌రిగా సెట్ కావ‌డం లేదు. కొత్త‌గా ఓ ఉద్య‌మాన్ని నిర్మించేందుకు గ‌ద్ద‌ర్‌ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇన్నాళ్ళూ తెలంగాణ‌లో స‌మ‌స్య‌లూ లేదా తెలుగు రాష్ట్రాల స‌మ‌స్య‌ల‌కే ప‌రిమిత‌మౌతూ వ‌చ్చిన గ‌ద్ద‌ర్‌ ఇప్పుడు ద‌క్షిణాది మొత్తాన్ని ప్ర‌భావితం చేసే ఉద్య‌మానికి శ్రీ‌కారం చుడుతున్నారు. అయితే, ఆయ‌న ఆశిస్తున్న స్థాయిలో ఈ ఉద్య‌మ వేదిక సిద్ధ‌మౌతుందా లేదా అనేదే అస‌లు ప్ర‌శ్న‌.?

ద‌క్షిణాది సాంస్కృతిక సామాజిక రాజ‌కీయ వేదిక’ అంటూ గ‌ద్ద‌ర్ కొత్త హ‌డావుడి మొద‌లుపెట్టారు. ఈ ఉద్య‌మం నిర్మించేందుకు తెలుగు, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప్ర‌ముఖుల వెంట గ‌ద్ద‌ర్ ప‌డుతున్నారు. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌లిసి పనిచేస్తాన‌ని గ‌ద్ద‌ర్ తాజాగా చెబుతున్నారు. ఈ ఉద్య‌మ వేదిక‌ను బ‌లోపేతం చేసే ప్ర‌య‌త్నంలో ఇప్ప‌టికే ఆ ఇద్ద‌రు స్టార్స్ కి రాయ‌బారం పంపిన‌ గద్దర్ వారి నుంచి త్వ‌ర‌లోనే అంగీకారం వ‌స్తుందని ఆశిస్తున్నారు. ద‌క్షిణాది ఆత్మ‌గౌర‌వ అజెండాతో ఉద్య‌మాన్ని నిర్మిస్తామని చెప్పారు. మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు స్మార‌క స్థూపానికి ఢిల్లీలో స్థలాన్ని ప్ర‌భుత్వం ఇవ్వ‌క‌పోవ‌డం అవ‌మానక‌రం అని గ‌ద్ద‌ర్ ఈ సంద‌ర్భంగా విమ‌ర్శించారు.

ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తే గ‌ద్ద‌ర్ పంపిన రాయ‌బారానికి త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నుంచి స‌మాధానం వ‌స్తుంద‌ని ఆశించ‌లేం! ఎందుకంటే, ఆయ‌న సొంత పార్టీని ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు. పైగా, గ‌ద్ద‌ర్ తో క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఆయ‌న‌కి లేద‌నే చెప్పాలి. ఇక‌, ప‌వ‌న్ క‌ల్యాన్ విష‌యానికొస్తే ద‌క్షిణాది ఆత్మ‌గౌర‌వం గురించి ప‌వ‌న్ ఎప్ప‌టిక‌ప్ప‌డు మాట్లాడుతూ ఉంటారు. ప్ర‌త్యేక హోదా విషయంలోగానీ, ఆ మ‌ధ్య తితిదే ఈవో నియామ‌క స‌మ‌యంలోగానీ ద‌క్షిణాదిపై చిన్న‌చూపు ఉంటోంద‌ని ఆక్రోశించారు. ఈ ఒక్క అంశం కామ‌న్ గా ఉంది కాబ‌ట్టి, ప‌వన్ మ‌ద్ద‌తు వ‌స్తుంద‌ని గ‌ద్ద‌ర్ ఆశిస్తున్నట్టున్నారు. కానీ, ఇంత‌వ‌ర‌కూ గ‌ద్ద‌ర్ ఆహ్వానంపై ప‌వ‌న్ స్పందించింది లేదు. గ‌ద్ద‌ర్ నిర్మించాల‌నుకుంటున్న ఉద్య‌మ వేదిక‌లో ప‌వ‌న్ భాగ‌స్వామ్యం ఉంటుందని ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుని ఆలోచిస్తే క‌ష్ట‌మ‌నే చెప్పాలి.