ఎంత చెట్టుకు అంత ‘గాలి’.!

186
మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్థనరెడ్డి ఆంధ్రజ్యోతి ఆర్కేకు తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. భాజపాను విడనాడే ప్రసక్తి లేదని  చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం కక్ష సాధింపుతోనే తనపై కేసులు పెట్టి వేధించింది తప్ప తప్పు జరిగింది లేదని చెబుతున్న గాలి మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎందుకు ఆ పార్టీని వదిలిపెడతారు? బిజెపికి అనుకూలంగా ఉన్న వారి మీద కేసులను పట్టించుకోవడం లేదనీ కాంగ్రెస్‌పైన ప్రాంతీయ ప్రత్యర్థులపైన కేసులు వెంటాడుతున్నారనీ చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి.
ఎలాచూసినా గాలి జనార్థనరెడ్డికి భాజపాని మించిన రక్షణ దుర్గం ఉండదు. పైకి పెద్ద హడావుడి చేయకపోయినా ఆయన గతంలో లాగే రాష్ట్రంలో భాజపాకి విధేయంగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గనక మరోసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు అంతకన్నా కావలసింది ఏముంటుంది.  చాలా కేసులు కొట్టివేయబడుతున్న నేపథ్యం కూడా ఆయనకు కొంత ఊరట కలిగించే అంశమే. ఓపెన్‌హార్ట్‌లో గాలి మాట్లాడిన తీరు చూస్తే పరిస్థితుల కారణంగా మనుషులు ఎంతగా మారిపోతారో తెలుస్తుంది. తాను గతంలో ఆవేశంతో మాట్టాడానని ఆర్కేను చంద్రబాబు వంటి వారిని అనవసరంగా దూషించానని పశ్చాత్తాపం వ్యక్తం చేయడం నాటకీయత.
వైఎస్‌తో తన సంబంధాలను వ్యాపార వేత్తకూ ముఖ్యమంత్రికి ఉండేవిగా తప్ప అంతకు మించిన సాన్నిహిత్యం చెప్పకపోవడం మరో విశేషం. శ్రేయోభిలాషి అన్న వర్ణన కూడా ఒప్పుకోలేదు. కూతురి పెళ్ళి విషయంలో పీటిన ఖర్చు లాంటి ఈ ఇంటర్వ్యూలో ఆసక్తి కలిగించే విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి గాని సంచలనాలేమీ లేవు. ఎందుకంటే ఆయన ఆచితూచి మాట్లాడుతూ వేదాంత ధోరణి కనపరచారు. అందులోనూ లౌక్యం కూడా పుష్కలంగా ప్రదర్శించారు. రామదాసు 18 ఏళ్ళు జైలులో ఉన్న ఉదంతంతో తన జైలు జీవితం పోల్చడం అయితే నభూతే..