పంచాయ‌తీ ఎన్నిక‌లకు సిద్ధమవుతున్న ‘తెలంగాణ’

86

ఏడాదిలో సార్వ‌త్రిక ఎన్నిక‌లున్నాయి. దాదాపుగా అన్ని పార్టీలూ సిద్ధ‌మైపోతున్నాయి. దానికంటే ముందుగా వ‌చ్చేనెల‌లో తెలంగాణలో ప‌ల్లె ఎన్నిక‌ల న‌గారా మోగ‌నుంది. తెలంగాణ గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న పాల‌క వ‌ర్గాల ప‌ద‌వీ కాలం జూలై నెలాఖ‌రుకి ముగుస్తుంది.

ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ఆగ‌స్టు 1కి క‌నీసం ఐదు వారాల ముందే ముగిసేలా ప్ర‌య‌త్నిస్తోంది. ఎందుకంటే, ఎన్నికైన కొత్త పాల‌క వ‌ర్గాల‌కు ఐదు వారాల పాటు శిక్ష‌ణ ఇవ్వాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. వ‌చ్చే నెల 6న ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న జారీ చేసి, అదే నెల 23 నాటికి మొత్తం ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘ అధికారుల‌తో, పంచాయ‌తీరాజ్ అధికారులు స‌మావేశ‌మై, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తేదీల‌పై ప్రెజెంటేష‌న్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

కొత్త‌గా అమ‌ల్లోకి వచ్చిన పంచాయ‌తీరాజ్ చ‌ట్టం ప్ర‌కారం నోటిఫికేష‌న్ వెలువ‌డ్డ త‌రువాత 12వ రోజున పోలింగ్ తో పాటు, ఫ‌లితాల వెల్ల‌డి కూడా జ‌రిగిపోవాలి. ఈ పన్నెండు రోజుల్లోపే ఇత‌ర కార్య‌క్ర‌మాల‌న్నీ పూర్తయిపోవాలి. మొత్తానికి, జూన్ 23 నాటికి పంచాయతీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ అంతా పూర్త‌యిపోవాల‌న్న‌ది స‌ర్కారు ప్ర‌తిపాద‌న. రాష్ట్రవ్యాప్తంగా 12,751 పంచాయ‌తీల పాల‌క వ‌ర్గాల‌కు జులై నెలాఖ‌రుతో ప‌ద‌వీ కాలం ముగుస్తోంది. వ‌చ్చే నెల 23 నాటికి కొత్త పాల‌క వ‌ర్గాల ఎన్నిక పూర్తి కావాల‌నేది తెరాస స‌ర్కారు ల‌క్ష్యం.

ఈ పంచాయ‌తీ ఎల‌క్ష‌న్స్ ని ప్ర‌ధాన పార్టీలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగానే తీసుకుంటాయి. తెరాస‌, కాంగ్రెస్ ల‌తోపాటు తెదేపా, టీజెఎస్‌లు స్థానిక ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైపోయాయి. నిజానికి, పంచాయ‌తీ ఎన్నికల్లో ఎక్కువ‌గా స్థానిక అంశాల ప్రాతిప‌దిక‌నే ఓటింగ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం పార్టీల హడావుడి చూస్తుంటే స్థానిక ఎన్నికలను ప్రధాన ఎన్నికలకు ప్రచారంగా తప్పకుండా వాడుకుంటాయి.