తెరాసపై పోటీగా ‘మహాకూటమి’కి సన్నాహాలు

27

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారనే విమర్శలు రాకుండా తెరాసకు గట్టి పోటీ ఇచ్చేలా మహాకూటమికి ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ తెదేపా నేతలకు చంద్రబాబు సలహా ఇచ్చారు. యునైటెడ్ ఫ్రంట్ మాదిరిగా ఒక కూటమిని ఏర్పాటు చేసి అందులో తెలుగుదేశం చేరితే ఎవరికి పెద్ద అభ్యంతరం ఉండబోదనేది చంద్రబాబు అభిప్రాయం.

హస్తినలోని కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఈ కూటమికి పచ్చజెండా ఊపారు. కూటమి స్వరూప స్వభావాలు, భాగస్వామ్య పక్షాలు మధ్య సీట్ల సర్ధుబాటు మాత్రమే మిగిలిఉందని ప్రచారం జరుగుతోంది. కూటమికి సిపిఐ, కోదండరాం, కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరించారు. సిపిఎంను కూడా సంప్రదిస్తున్నారు. కేంద్రంలో భాజపా మరోసారిఅధికారంలోకి వస్తే ఏపీకి ఇబ్బంది అనే ఉద్దేశంతో భాజపా మిత్రపక్షాలను టార్గెట్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

నాలుగున్నర సంవత్సరాల తెరాస పాలన పై వ్యతిరేకత ఉందని, అందువలన కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, కోదండరాం కూటమిగా ఏర్పడి, సీట్ల సర్ధుబాటు పక్కాగా జరిగితే దెబ్బకొట్టవచ్చనేది తెదేపా నేతలు విశ్లేషిస్తున్నారు. సమయానుకూలంగా అన్ని విషయాల్లో తెదేపా నేతలకే నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇచ్చారు. తెలంగాణ ఏర్పడినప్పుడు విపరీతంగా సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు అది లేదు.

చంద్రబాబు ప్రచారం ఉండకపోవచ్చన్న అంచనాలు పార్టీ నుండి వస్తున్నాయి. ఎన్నికల సమరం తారస్థాయికి చేరినప్పుడు అవసరమైతే చంద్రబాబు ప్రచారం ఉంటుందంటున్నారు. అది రాజకీయ వ్యూహంలో భాగమని చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌తో పొత్తు అనే ప్రస్తావన రాకుండా మహాకూటమిగా తెరాసపై పోరాటానికి తెదేపా సిద్ధమైనట్లే అనుకోవాలి.