జీఎస్టీపై వెంకయ్య ఏమంటున్నారంటే..

335

వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్టీ)ను భాజ‌పా స‌ర్కారు అమ‌ల్లోకి తెచ్చేసింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన‌ ప్ర‌త్యేక స‌మావేశాన్ని కొన్ని రాజ‌కీయ పార్టీలు బ‌హిష్క‌రించాయి. ఈ నేప‌థ్యంలో జీఎస్టీ గురించి కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు మాట్లాడారు. న‌రేంద్ర మోడీ స‌ర్కారు తీసుకున్న ఏ నిర్ణ‌యం గురించి అయినా వెంక‌య్య నాయుడు ఎంత గొప్ప‌గా చెప్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.జీఎస్టీ గురించి కూడా త‌న‌దైన శైలిలో ఆయ‌న స్పందించారు. జీఎస్టీపై వ్య‌క్త‌మౌతున్న అనుమానాలు కేవ‌లం అపోహ‌లు మాత్ర‌మే అని, రాష్ట్రాలపై కేంద్రం పెత్త‌నం పెంచుకునేందుకే ఈ ప‌న్నుల విధానం అంటూ వినిపిస్తున్న విమ‌ర్శ‌లు అర్థ‌ర‌హిత‌మైన‌వి వెంక‌య్య నాయుడు కొట్టిపారేసారు.

జీఎస్టీని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలూ ఏక‌గ్రీవంగా తీర్మానించాయ‌ని చెప్పారు. ఎవ‌రికైనా అవ‌గాహ‌న లేక‌పోతే మ‌న‌మేం చెయ్య‌లేమ‌నీ, పార్ల‌మెంటు త‌న అధికారాన్ని రెండూ బై మూడో వంతు మెజారిటీతో జీఎస్టీ కౌన్సిల్ కి ఇచ్చింద‌ని అన్నారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు చ‌ర్చించుకున్న త‌రువాతే జీఎస్టీ కౌన్సిల్ కి అధికారం ఇచ్చాయ‌నీ, ఈ కౌన్సిల్ లో స‌భ్యులు ప్ర‌త్యేకంగా ఎక్క‌డి నుంచో అపాయింట్ చేసివారు కాద‌నీ, వారంతా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులే అని వెంక‌య్య వివ‌రించారు. ఈ మాత్రం క‌నీస ప‌రిజ్ఞానం లేకుండా కొంత‌మంది విమ‌ర్శ‌లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌నీ, వారిలో అవ‌గాహ‌న పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. కొన్ని పార్టీలు ఈ ప్ర‌త్యేక స‌మావేశాన్ని బ‌హిష్క‌రించ‌డానికి కార‌ణాలు వారే చెప్పాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు.

ప్ర‌స్తుతం దేశంలో ప‌రిస్థితులు మారాయ‌నీ, గ‌తంలో మాదిగా కాకుండా 24/7 ప‌ని చేయ‌డం అనేది ఇప్పుడుంద‌నీ, ఇదో శుభ కార్యం, అర్ధ‌రాత్రి మంచి స‌మ‌యం అనుకున్నారు కాబ‌ట్టి కార్య‌క్ర‌మం పెట్టుకున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కూ 17 సార్లు కౌన్సిల్ లో చ‌ర్చ‌లు జ‌రిగాయ‌న్నారు. ఇంకా ఇలాంటి కీల‌క‌ సంస్క‌ర‌ణ‌ను వాయిదా వేయ‌డ‌మంటే దేశ అభివృద్ధిని వాయిదా వేసుకున్న‌ట్టే అవుతుంద‌ని అన్నారు. జీఎస్టీ అమ‌లు వ‌ల్ల అవినీతి అంత‌మౌతుంద‌నీ, వేధింపులు పోతాయ‌నీ, పార‌ద‌ర్శ‌క‌త వ‌స్తుందని చెప్పారు. మొత్తానికి ఇదో స‌ర్వ‌రోగ నివార‌ణి అన్న‌ట్టుగా వెంక‌య్య వ‌ర్ణించుకుంటూ వ‌చ్చారు. నాడు పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం గురించి కూడా ప‌ర‌మౌష‌ధమ‌నీ, సంజీవ‌ని అనీ, మ‌హాయజ్ఞ‌మ‌నీ చాలా చెప్పారు.