దేశమంతటా ‘జీఎస్టీ’ జేగంట మోగింది

379

దేశ పన్నుల వ్యవస్థలో పెను సంస్కరణ ఆవిష్కృతమైంది. పార్లమెంట్‌ సెంట్రల్‌హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ అర్థరాత్రి 12.01 గంటలకు జేగంట మోగించి జీఎస్టీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, మాజీ ప్రధాని దేవగౌడ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, అనంత్‌కుమార్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, సీనియర్‌నేత అడ్వాణీ, ఎన్సీపీ నేత శరద్‌పవార్‌, వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన విధంగానే విపక్ష పార్టీలు జీఎస్టీకి స్వాగత కార్యక్రమానికి హాజరుకాలేదు.

అంతకు ముందు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాని మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జీఎస్టీ స్వాగత ఉపన్యాసాలు చేసారు. జైట్లీ మాట్లాడుతూ‘‘దేశం సాధించిన గొప్ప విజయం జీఎస్టీ. జీఎస్టీతో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోంది. జీఎస్టీతో ఇకపై ఒకే దేశం-ఒకే పన్ను. జీఎస్టీ కల సాకారానికి రాష్ట్రాలు, అధికారులు ఎంతగానో శ్రమించారు. ఎన్డీఏ-1 పాలనలో జీఎస్టీ అంశం తెరపైకి వచ్చింది. విజయ్‌ కేళ్కర్‌ తన నివేదికలో జీఎస్టీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. యూపీఏ ప్రభుత్వం జీఎస్టీ తదుపరి ప్రక్రియను కొనసాగించింది. జీఎస్టీ అమలుకు 15ఏళ్ళ సమయం పట్టింది. దేశంలో అతిపెద్ద పన్నుల సంస్కరణ ప్రారంభం కాబోతోందని” వివరించారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘మరి కొన్ని క్షణాల తర్వాత దేశం కొత్తదారిలో నడిచేందుకు సిద్ధంగా ఉంది. జీఎస్టీ కేవలం ఆర్థిక సంస్కరణలకే కాదు.. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రక్రియ. సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ గొప్ప ఉదాహరణగా నిలవబోతోంది. ఈ కొత్త వ్యవస్థ ఏ రాజకీయ పార్టీకో, వ్యక్తులకో చెందినది కాదు. ఇది అందరి విజయం’’ అని పేర్కొన్నారు.

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మాట్లాడుతూ.. ఏకీకృత పన్నువిధానం జీఎస్టీ. పన్ను విధానంలో అత్యంత సమగ్రతతో కూడుకున్నది జీఎస్టీ అని వివరించారు. 2009లో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ జీఎస్టీపై ప్రథమ ముసాయిదా ఇచ్చింది. 2011, 2012లో నేనే స్వయంగా మంత్రుల కమిటీతో చర్చలు జరిపానని తెలిపారు. ఏపీ, బిహార్‌, గుజరాత్‌ సీఎంలతో స్వయంగా చర్చలు జరిపినట్లు చెప్పారు. సీఎంలు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిరంతర చర్చల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు.