ఉక్కు ఫ్యాక్టరీ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమట

95

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పాల‌న అంతా భాజ‌పా వ‌ల్ల‌నే జ‌రుగుతున్న‌ట్టు భాజ‌పా ఎంపీ జ‌వీఎల్ న‌ర్సింహారావు మ‌రోసారి మాట్లాడారు. ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటు విష‌య‌మై క‌డ‌ప‌లో తెదేపా నేత‌లు చేస్తున్న దీక్షపై జీవీఎల్ స్పందించారు. క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ ఆల‌స్యానికి కార‌ణం కూడా రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రే అనే వాద‌న వినిపించారు.

క‌డ‌ప జిల్లా అభివృద్ధిపై తెదేపాకి చిత్త‌శుద్ధి ఉంటే కేంద్రం అడిగిన స‌మాచారాన్ని వెంట‌నే ఇచ్చి స‌హ‌క‌రించాల‌న్నారు. రాష్ట్రంలో మొత్తం 8 గ‌నులుంటే వాటిలో 7 ప‌నిచేసే ప‌రిస్థితుల్లో లేవన్నారు. స‌రైన స‌మాచారం లేకుండా వేల కోట్ల పెట్టుబ‌డులు ఎలా పెడ‌తార‌నీ, ఆ త‌రువాత ముడి ఖ‌నిజం ఎక్క‌డి నుంచి వ‌స్తుంద‌ని  ప్ర‌శ్నించారు. కేంద్రంలో అడ్డ‌గోలు నిర్ణ‌యాలు ఉండ‌వ‌నీ, ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం తీసుకునే నిర్ణ‌యాల్లో హేతుబ‌ద్ధ‌త ఉంటుంద‌ని చెప్పారు.

స్టీల్ ప్లాంట్ కి ఐర‌న్ ఓర్ ఎక్క‌డి నుంచి ఎంత వ‌స్తుందీ, ఉన్న నిల్వ‌లు ఎంత అనే స‌మాచారం ఇవ్వకుండా కేంద్రాన్ని నిందించ‌డ‌మేంట‌ని విమ‌ర్శించారు. ఈ స‌మాచారాన్ని కేంద్రానికి ఇవ్వాల్సిన క‌నీస బాధ్య‌త రాష్ట్రానికి ఉంటుంద‌నీ, కాబ‌ట్టి ఇలాంటి దీక్ష‌లు చేయ‌డం వ‌ల్ల వారి ప‌రువే పోతుంద‌నీ, స‌రైన విష‌య ప‌రిజ్ఞానం లేకుండా నేత‌లు దీక్ష‌లు చేయ‌కూడ‌ద‌ని, వెంట‌నే దీక్ష‌లు విర‌మించుకోవ‌డం మంచిద‌ని సూచించారు.

క‌డ‌ప ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటు కాక‌పోవ‌డానికి,  ప్ర‌త్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వ‌క‌పోవ‌డానికి కూడా కార‌ణం ఏపీ స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డ‌మే. రాష్ట్రానికి నిధులు రాక‌లో ఆల‌స్య‌మౌతుండ‌టానికి కూడా ఏపీ స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డ‌మే కార‌ణమట.  మొన్న‌టికి మొన్న సుప్రీం కోర్టులో అఫిడ‌విట్ ఫైల్ చేస్తూ ఉక్కు క‌ర్మాగారం అసాధ్య‌మ‌ని చెప్పి, ఫైల్ మూసేయ‌డానికి కేంద్రం ప్ర‌య‌త్నించింది. రాష్ట్రంలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తేస‌రికి ఫ్యాక్ట‌రీ క‌ట్టించి తీర‌తామ‌ని మాట మార్చారు.

సమాచారం లేకుండా తెదేపా నేతలు దీక్షలేంటని ప్రశ్నిస్తున్న ఆయన రాష్ట్రంలో ఖ‌నిజ రిజ‌ర్వులు ప‌రిపూర్ణంగా ఉన్నాయా లేవా అనే పరిపూర్ణ స‌మాచారం చూసుకోకుండా క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీకి మోడీ శంకుస్థాప‌న చేసేస్తార‌ని ఏ ప్రాతిపదికన ప్ర‌క‌టనలు చేసారో మాత్రం చెప్పటం లేదు. ఫ‌్యాక్ట‌రీ కేంద్రం ఇచ్చి తీరుతుంద‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఢంకా బ‌జాయిస్తున్నారు. అంటే, క‌డ‌ప ప్రాంతంలోని ఐర‌న్ ఓర్ నిక్షేపాల‌కు సంబంధించిన సమాచారం ఆయన ద‌గ్గ‌ర ఉందనుకోవాలా.? ఉంటే వారి నుంచే తీసుకోవచ్చుగా.!