నిధులు ఇవ్వకపోవటం తప్పేమీ కాదట

131

వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం తెలంగాణకు నిధులు విడుదల చేసి ఏపీకి విడుదల చేయకపోవడంపై రాజకీయ దుమారం రేగింది. ఈ విషయంలో మరోసారి భాజపా ప్రజల ముందు దోషిగా నిలబడింది.

జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో మాట్లాడుతూ నిధులు ఎందుకు ఇవ్వలేదన్న విషయాన్ని చెప్పకుండా ఇవ్వకపోవడం తప్పేమీ కాదని తన పార్టీని వెనుకేసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కేంద్రం నుంచి ఏపీకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఏడాది రూ.10,575 కోట్లు వచ్చాయని లెక్కలు వేసి మరీ చెప్పారు. దీన్ని చూసే ఏపీపై కేంద్రం వివక్ష చూపించడం లేదని తెలుసుకోవాలంటున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా అన్ని యూసీలు ఇచ్చానని కానీ, ఇవ్వలేదని కానీ తప్పుడు యూసీలు ఇచ్చామని కానీ కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేసారు. అసలు యూసీలు ఇచ్చిన తర్వాతనే రూ.350కోట్లు విడుదల చేసారని మోడీ వద్దన్నారనే వెనక్కి తీసుకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేసారు. కానీ కేంద్రం ఇంత వరకూ అధికారికంగా స్పందించలేదు.

ఆయనకు తెలిసినంత వరకు యూసీలు ఇవ్వలేదని అంటున్న జీవీఎల్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసారు. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో రాష్ట్రం చెప్పాలని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధికార ప్రతిధిగా మాత్రమే కాకుండ ఎంపీగా ఉన్న జీవీఎల్ ఇలాంటి లేఖ రాయడం ఆశ్చర్యపరుస్తోంది.