రాజ్యసభలో హరివంశ్ వర్సెస్ హరిప్రసాద్

32

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నది ఎవరో తేలిపోయింది. భాజపా మద్దతుతో జేడీయూ ఎంపీ హరివంశ్, కాంగ్రెస్, మిత్రపక్షాలతో పాటు తటస్థ పార్టీలు మద్దతుతో కర్నాటక కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్ కీలక పదవి కోసం జరగబోయే ఎన్నికల బరిలో ఉన్నారు.

విపక్ష పార్టీల తరపున అభ్యర్థిని నిలబెట్టేందుకు ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆసక్తి చూపించలేదు. కాంగ్రెస్‌ తన అభ్యర్థిని నిలబెడితే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని హామీ ఇచ్చాయి. దీంతో ఆ పార్టీ హరిప్రసాద్‌ పేరును ఖరారు చేసింది. ఆయన నామినేషన్‌ దాఖలు చేసారు. మరోవైపు ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ కూడా నామినేషన్ వేశారు.

గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది. వాస్తవానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని విపక్షాలకు ఇవ్వాలి. కానీ భాజపా మాత్రం తమ కూటమి చేతుల్లోనే ఉండాలని నిర్ణయించుకుని పూర్తి మెజార్టీ లేకపోయినా పోటీకి సిద్దమయింది. ప్రస్తుతం రాజ్యసభలో 244 మంది సభ్యులున్నారు. ఈ ఎన్నికలో మెజార్టీ సాధించాలంటే 123 ఓట్లు అవసరం. ముగ్గురేసి సభ్యులున్న శివసేన, అకాలీదళ్, తొమ్మిది మంది సభ్యులు ఉన్న బీజేడీ ఓటింగ్‌కు గైర్హాజరవుతారన్న ప్రచారం జరుగుతంది.

అకాలీదళ్, శివసేనను లెక్క నుంచి తీసేస్తే ఎన్డీఏ బలం 110 మాత్రమే అవుతుంది. వైకాపా, భాజపా అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించగా తెదేపా ఇప్పటికే హరి ప్రసాద్ కు మద్దతు ప్రకటించింది. ఈ రెండు పార్టీలతో కలుపుకుని 119 మంది సభ్యుల బలం ఉందని కాంగ్రెస్ చెబుతోంది. ఆప్‌, పీడీపీ, డీఎంకే కూడా కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేయనున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే భాజపా అభ్యర్ధిది గడ్డు పరిస్థితే.!