కుమారస్వామి కోసం సవాళ్ళు ఎదురుచూస్తున్నాయి

192

కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసి పదిరోజులయినా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టలేదు. కాంగ్రెస్‌తో మంత్రి పదవుల పంపకం కొలిక్కి రాక కేబినెట్‌ను ఏర్పాటు చేసుకోని తరుణంలో రుణమాఫీ కోసం రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

రైతులకు రుణమాఫీ చేయాల్సిందేనని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప అసెంబ్లీలో ప్రభుత్వానికి వారం రోజులు మాత్రమే గడువిచ్చారు. ఆ లోపు రైతులకు రుణమాఫీని ప్రకటించాలని డిమాండ్ చేసారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రైతు రుణమాఫీ పథకంపై యూటర్న్ తీసుకున్నారని అక్కడి మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీన్ని కుమారస్వామి ఖండించారు.

యడ్యూరప్ప ఇచ్చిన గడువు ముగియడంతో కుమారస్వామి రైతులతో సమావేశం ఏర్పాటు చేసారు. కర్ణాటకలో ఉన్న 30 జిల్లాల నుంచి వచ్చిన రైతు ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. తనకు పదిహేను రోజుల సమయం కావాలని కుమారస్వామి రైతు ప్రతినిధులను కోరారు. రైతులందరికీ రుణ విముక్తి కల్పిస్తామనీ రెండు దశల్లో మొత్తం రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే పంటల పేరుతో రుణాలు తీసుకుని కార్లు, బైకులు, ఇతర వస్తువులు కొనుగోలు చేసుకున్న వారికి రుణమాఫీ చేయడం కరెక్ట్ కాదన్నట్లు వ్యాఖ్యలు చేసారు.

కర్ణాటకలో రైతుల రుణాలు రూ.53 వేల కోట్లు ఉండవచ్చని అంచనా. రుణమాఫీ అంశంతో కుమారస్వామిని ఇబ్బంది పెట్టాలని యడ్యూరప్ప భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌తో పదవుల పంపకం అంశం కొలిక్కి రావడం లేదు. పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ జరిపితే కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో  ఉన్న కుమారస్వామి కోసం ఎన్నో సవాళ్ళు సిద్ధంగా ఉన్నాయి.