‘శ్రీదేవి బంగ్లా’ అంటూ వివాదం మొదలెట్టారు

1494

కన్నుగీటుతో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ గా మారిపోయిన ప్రియ ప్రకాష్ వారియర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. మలయాళ దర్శకుడు ప్రశాంత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘శ్రీదేవి బంగ్లా’ అనే సినిమాలో ఆమె నటిస్తోంది.

‘శ్రీదేవి’ అనే సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ పాత్రలో ప్రియా కనిపించనున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోగా చిత్ర యూనిట్‌కు కష్టాలు తెచ్చిపెట్టింది. సినిమా పేరు, ట్రైలర్‌లో హీరోయిన్‌ బాత్‌టబ్‌లో పడి చనిపోవడం వంటి సీన్లు ఉండటంతో దివంగత నటి శ్రీదేవి జీవితం ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతోందా అనే ప్రచారం మొదలైంది.

ఈ క్రమంలో శ్రీదేవి భర్త, బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్ ప్రియాకి, ఈ చిత్ర దర్శకుడికి లీగల్‌ నోటీసులు పంపారు. దీంతో శ్రీదేవి అన్న పేరు చాలా మంది అమ్మాయిలు పెట్టుకుంటారని, ఈ విషయమై బోనీతో చర్చిస్తామని ప్రశాంత్‌ పేర్కొన్నాడు. కాగా బోనీ కపూర్‌ సన్నిహితులు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘తన భార్య పేరును, ఆమె పేరిట ఓ నీతిలేని కథను తెరకెక్కించడాన్ని బోనీ అంగీకరించలేరు. ఈ సినిమాను నిలిపివేసేంత వరకు బోనీ కపూర్‌ అస్సలు ఊరుకోరు. వారి సినిమా గురించి ప్రజల్లో ఆసక్తి రేకెత్తించేందుకు శ్రీదేవి బంగ్లా అనే పేరు పెట్టుకోవచ్చు. అయినప్పటికీ బోనీ వీటన్నింటిని సహించరు. సినిమాను ఆపేందుకు ఆయన చట్టబద్ధంగా ముందుకు వెళ్తారు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్‌ ప్రకటించింది.