రివ్యూ : 24 ఫ్రేమ్స్ ‘గుద్దులే’ గుద్దులు.!

349
ఇటీవలి కాలంలో ప్రేమ‌క‌థా చిత్రాలు అంటే లిప్ లాక్‌లతో ఉంటున్నాయి. అలాంటి ముద్దులపై అయోధ్య‌కుమార్ కృష్ణంశెట్టి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారి చేసిన సినిమా ’24 కిస్సెస్‌’. 24 ముద్దులు ఏమిటో అని ఆసక్తిని రేపిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథేమంటే..
ఆనంద్‌ (అరుణ్ అదిత్‌) ఓ చిల్డ్ర‌న్ ఫిలిమ్ మేక‌ర్‌. ఓ కాలేజ్‌లో సినిమాల‌కు సంబంధించిన కోర్సు చ‌దువుతున్న విద్యార్థులకు పాఠాలు చెప్ప‌డానికి మెంట‌ర్‌గా వెళ‌తాడు. ద‌ర్శ‌కుడిగా త‌ను చేసే సినిమాల‌తో పాటు అతని మాన‌వ‌త్వం చూసి శ్రీల‌క్ష్మి(హెబ్బా ప‌టేల్‌) అతన్ని ప్రేమిస్తుంది. అనుకోకుండా ఓ సంద‌ర్భంలో ఆనంద్‌, శ్రీలక్ష్మిని త‌ల‌పై ముద్దు పెట్టుకుంటాడు. అస‌లు ఆనంద్ త‌ల‌పై ముద్దు ఎందుకు పెట్టాడ‌నే విష‌యాన్ని ఇంట‌ర్నెట్‌లో చూసిన‌ప్పుడు శ్రీల‌క్ష్మికి 24 ముద్దులు గురించి విష‌యం తెలుస్తుంది. 24 ముద్దులు పెట్టుకున్న జంట విడిపోద‌నే విష‌యం కూడా ఆమెకు తెలుస్తుంది. వివిధ సంద‌ర్భాల్లో ఆనంద్‌, శ్రీల‌క్ష్మి ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. 13 ముద్దులు పూర్త‌యిన త‌ర్వాత ఆనంద్‌కు త‌న‌ను ప్రేమించ‌డం లేద‌నే విష‌యం తెలిసి అత‌నితో గొడ‌వ‌ప‌డి వెళ్ళిపోతుంది. మళ్ళీ క‌లుసుకుని ఇంకో 10 ముద్దులు పెట్టుకున్నాక అస‌లు ఆనంద్‌కు పెళ్ళి, పిల్లలు అంటే ఇష్టం లేద‌నే విష‌యం తెలుస్తుంది. అప్ప‌టికే త‌న‌కు ఇద్ద‌రు, ముగ్గురితో శారీర‌క సంబంధాలున్నాయ‌ని తెలుసుకుని గొడ‌వ‌ప‌డి త‌న‌ను ఎప్పుడూ క‌ల‌వొద్ద‌ని వెళ్ళిపోతుంది. ఆనంద్‌కు పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదు? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే..
హీరో, హీరోయిన్ మ‌ధ్య ప్రేమ పుడుతుంది. హీరోకు ప్రేమంటే న‌మ్మ‌కం ఉండ‌దు. అప్ప‌టికే ఇద్ద‌రి ముగ్గురితో సెక్స్ చేసుంటాడు. హీరోయిన్ అంటే ఇష్ట‌మే అంటాడు కానీ ప్రేమ లేదంటాడు. కాసేప‌టి హీరోయిన్ ప్రేమ అర్థ‌మైంద‌ని అంటాడు. మళ్ళీ పెళ్ళి వ‌ద్దంటాడు. వీధి బాలల కోసం పోరాడతాడు. కానీ పెళ్ళి చేసుకుని పిల్ల‌ల్ని కనాలని అనుకోడు. ఎమ్మార్వోతో పిల్ల‌ల కోసం చేసే పోరాటం చూస్తే సిల్లీగా క‌న‌ప‌డుతుంది. హీరో పిల్ల‌ల్ని వ‌ద్ద‌ని చెప్పే రీజ‌న్ ఇంకా సిల్లీ ఉంది. సినిమాలో హీరోయిన్‌కి అత‌ను త‌ప్ప మ‌రేవ‌రూ న‌చ్చ‌రు. గొడ‌వ‌ప‌డ్డ త‌ర్వాత కూడా హీరోయిన్, హీరోతో ముద్దులు పెట్టించుకుంటుంది. చెప్పాల‌నుకొన్న క‌థ‌ని సాగ‌దీస్తూ మ‌ధ్య‌లో బోల్డ్ కంటెంట్‌ని చొప్పిస్తూ, డాక్యుమెంట‌రీలా చూపించాల్సిన విష‌యాల‌న్నింటినీ మ‌ధ్య‌లో ఏక‌ర‌వు పెడుతూ ప్రేక్ష‌కుడి స‌హ‌నాన్ని ప‌రీక్షించారు. ద‌ర్శ‌కుడికి క‌థపైనే స్ప‌ష్ట‌త కొర‌వ‌డింది. ఆరంభం, ఎత్తుగ‌డ బాగున్నప్ప‌టికీ ఆ త‌ర్వాత  ముందుకు న‌డిపించే విధాన‌మే ఏమాత్రం మింగుడుప‌డ‌దు. ఒక ద‌శ‌లో ఈ సినిమాలో క‌థ‌నేది ఉందా లేదా అనే అనుమానం క‌లుగుతుంది. ఈ క‌థ‌ని ముద్దుల‌తో ముడిపెట్టిన విధానం కూడా ఏమాత్రం అత‌క‌లేదు. దర్శ‌కుడు సన్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా, ఎమోష‌న‌ల్‌గా రాసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ‘వాట్ ద ఫ‌క్’ అనే డైలాగ్‌ను ఒకమ్మాయితో సింపుల్‌గా చెప్పించేసిన దర్శకుడు ఆడియన్స్ ను హింస పెడితే ఏమంటారో తెలుసుకోలేకపోయాడు.
ఎవరెలా:
ఆనంద్ గా అదిత్ పాత్ర మేర‌కు న్యాయం చేశాడు. అయితే ఇలాంటి సినిమా చేయ‌డం వ‌ల్ల త‌న‌కు వ‌చ్చే ఉప‌యోగం ఏమీ ఉండ‌దు. హెబ్బా ప‌టేల్ ముద్దు సీన్స్‌కు ఏం న‌చ్చి ఒప్పుకుందో తెలియ‌దు. ఇలాంటి సినిమా వ‌ల్ల ఆమె కెరీర్‌కు ఎలా ఉప‌యోగ క‌రంగా ఉంటుందో త‌న‌కే తెలియాలి. హీరోయిన్ తండ్రి పాత్ర‌లో సీనియ‌ర్ న‌రేశ్‌, సైక్రియాటిస్ట్ పాత్ర‌లో రావు ర‌మేశ్‌లు ఉన్నామంటే ఉన్నార‌నేలా న‌టించారు. రావు ర‌మేష్ పాత్ర కామెడీగా అనిపిస్తుంది. మిగిలిన పాత్ర‌ధారులందరూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేసారు.
ఫైనల్ గా..
ముద్దుల కోసం వెళ్ళారో గుద్దులే గుద్దులు.!