స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేస్తారా.?

405

ప్రపంచంలో స్వలింగ సంపర్కం అనేది అనేక దేశాల సంస్కృతి, సంప్రదాయాలకు ఒక సవాలుగా మారింది. పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు కొన్ని దేశాలు ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసాయి. ఇప్పటికే 26 దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసారు.

భారత్‌లో ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు సన్నిహితంగా ఉంటే వింతగా చూస్తారు. అలాంటి దేశంలో స్వలింగ సంపర్కం, స్వలింగ వివాహాలకూ మద్దతు దొరుకుతుందా.? హిందూత్వ పార్టీ భాజపా అధికారంలో ఉండగా అసాధ్యం.? కానీ సుప్రీంకోర్టు మాత్రం 2013లో ఇచ్చిన తీర్పును సమీక్షించడానికే నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్కం నేరం కిందకే వస్తుందంటూ 2013లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్పును సమీక్షించాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ప్రధానంగా ఈ కేసు ‘సెక్షన్‌377’గా ప్రచారంలోకి వచ్చింది.

ఈ సెక్షన్‌ కింద ప్రకృతి విరుద్ధంగా జరిగే లైంగిక సంపర్కం నేరం. నేరాన్ని అతిక్రమిస్తే జీవితఖైదు లేదా పదేళ్ళ జైలు విధించే అవకాశం ఉంది. 1861 నుంచి ఈ శిక్ష భారత శిక్షా స్మృతిలో ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ 2001లో నాజ్‌ ఫౌండేషన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు కూడా స్వలింగ మనుషులైనా పరస్పర అంగీకారంతో జరిగే సెక్స్‌ నేరం కాదని తీర్పు చెప్పింది. ఈ తీర్పును కొంత మంది సుప్రీంకోర్టులో సవాల్ చేయటంతో 2013 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆ తర్వాత గే హక్కుల కార్యకర్తలు రివ్యూ పిటిషన్లు వేసారు. అప్పట్లో సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2016 ఫిబ్రవరిలో కొంత మంది క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడంతో వాటిని ధర్మాసనానికి సిఫార్సు చేసింది. అయితే దీనిపై ఇప్పుడు విచారణ చేయవద్దని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం తోసి పుచ్చుతూ తీర్పుని పునఃసమీక్షించాలని నిర్ణయించామని స్పష్టం చేసింది.