బీసీలకు అన్యాయం జరిగిందనే పార్టీ వదిలేసారట

66

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్ తాను ఎందుకు పార్టీ వీడుతున్నానో చెప్పేందుకు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ మీట్ లో 70 శాతం కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి మిగతా 30 శాతం కేసీఆర్‌ను పొగడటానికి సమయం కేటాయించారు.

కాంగ్రెస్‌ పార్టీకి 30 ఏళ్ళు సేవలు చేసానని చెప్పుకున్న ఆయన ఈరోజు ఇలా ఉండటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకే వర్గం చేతుల్లో ఉందని విమర్శలు గుప్పిస్తూ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై సానుభూతి చూపించారు. ఆయనను కొందరు పని చేయనివ్వడం లేదని తేల్చేసారు.  గ్రేటర్ ఎన్నికల్లో తనకు చెప్పకుండానే టిక్కెట్లిచ్చారని దానం ఆరోపించారు.

కాంగ్రెస్‌కు గ్రేటర్ అధ్యక్షుడిగా ఉన్నపుడే దానంపై బహిష్కరణ వేటు వేద్దామని అనుకున్నారు. కాంగ్రెస్‌లో ఉండి టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడమే అందుకు కారణం. అదే సమయంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఫ్లెక్సీలు కూడా వేసుకున్నారు. కానీ చివరి క్షణంలో ఆగిపోయారు. ఇప్పుడేమో గ్రేటర్ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. అప్పట్నుంచి గ్రేటర్ అధ్యక్షునిగానే ఉన్న దానం పార్టీ తరపున ఏ కార్యక్రమం చేపట్టలేదు.

తర్వాత దానం నాగేందర్‌ను తీసేసి ఆ స్థానంలో అంజన్ కుమార్‌యాదవ్‌ను ఏఐసిసి నియమించింది. దీన్ని సాకుగా చూపి ఇప్పుడు టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోతున్నారు. బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని గట్టిగానే వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది వెళ్ళిపోతారని, అందుకే తాను అందరి కంటే ముందుగానే దారి చూసుకున్నట్లు సమర్థించుకునే ప్రయత్నం చేసారు. ఏదేమైనా పార్టీ నుండి వెళ్తూ దానం నాగేందర్ సగటు రాజకీయ నాయకుడిలాగే వ్యవహరించారు. దానం ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌కు పోయేది, టీఆర్ఎస్‌కు వచ్చేది ఏమైనా ఉందా అంటే, కాలమే చెప్పాలి.