ముద్రగడపై ఏపీ ప్రభుత్వానిది ఓవర్ యాక్షనా.?

301

కాపునాయకుడు ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల ఉద్యమం కార్యక్రమం ప్రకటించిన ప్రతిసారి ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఊరక ముందే మంత్రులూ, తెలుగుదేశం నేతలు ఆయనపై విరుచుకుపడటం పరిపాటిగా మారింది. నిరాహారదీక్ష సందర్భంలో ఆయన ఇంటి దగ్గర పోలీసుల చొరబాటు, తర్వాత ఆయన ఉన్న ఆస్పత్రి దగ్గర విపరీత భద్రత వంటివి షరా మామూలే. ఇప్పుడు ఆయన ఛలో అమరావతి అంటుంటే మళ్ళీ అదే విమర్శల పర్వం మొదలైంది.

హోంమంత్రి చినరాజప్ప వంటివారు రంగంలోకి దిగి ముద్రగడకు రిజర్వేషన్లు ఇపుడే గుర్తొచ్చాయా ? అంటూ ఎదురు దాడికి దిగారు. కోరితే అనుమతులు ఇస్తామని, ఆంక్షలు తప్పవని అన్నారు. నిజంగా ముద్రగడ చేసే ఆందోళన వల్ల అంత ప్రభావం ఉంటుందా? అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా అనే దానిపై అనేక రకాల వాదనలు వున్నాయి. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తనదైన శైలిలో దీనిపై విశ్లేషణ చేసారు. వ్యూహాలలో దిట్ట అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ముద్రగడ విషయంలో శ్రుతిమించి దాడి చేస్తున్నారనేది ఉండవల్లి వ్యాఖ్యానం.

ముద్రగడ పట్ల కఠినంగా వ్యవహరించడం ద్వారా ఆయనను వ్యతిరేకించే వారిని పూర్తిగా తనవైపు తిప్పుకోవచ్చన్న అంచనాతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారేమోనని ఒక ఇంటర్వ్యూలో సందేహం వెలిబుచ్చారు. ‘లేకుంటే అక్కడ అంత లేదు కాని తానేదో గొప్పగా అణచేసాననిపించుకోవడానికే ఇంత హడావుడి చేస్తున్నారేమో” అన్నారాయన. అయితే వీటివల్ల కాపులలో తెదేపా ప్రభుత్వంపై విముఖత పెరుగుతున్నదని కూడా చెప్పారు. గతంలో తూర్పు గోదావరి జిల్లాలో పవన్‌ కళ్యాణ్‌ కారణంగా భారీ ఎత్తున తెదేపాకి పడిన వారి ఓట్లు ఇప్పుడు రాకపోవచ్చని జోస్యం చెప్పారు. ఏది ఏమైనా ప్రభుత్వం అతిగా స్పందిస్తున్న మాట మాత్రం నిజమేనన్న భావన చాలామందిలో ఏర్పడుతోంది. దీనివల్ల అవతలివారి ఓట్లు వస్తాయే లేదో గాని వీరి ఓట్లు మాత్రం పోవచ్చేమో.