అసెంబ్లీ స్థానాల పెంపుకై భాజపా సిద్ధమా.?

123

ఆరు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉందనే చెప్పాలి. దీనికి సంబంధించిన బిల్లును పార్ల‌మెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదించే అవ‌కాశం ఉంది. తెలంగాణ‌, ఆంధ్రాల‌తో పాటు మ‌రో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ను పెంచేందుకు వీలుగా ఈ బిల్లు రూపొందుతుంద‌ని చెపుతున్నారు. తెలుగు రాష్ట్రాలు మాత్రం నియోజ‌క వ‌ర్గాల సంఖ్య పెంపు కోసం చాలా ఆశ‌గా ఎదురుచూస్తున్నాయన‌డంలో సందేహం లేదు. ఫిరాయింపుల పుణ్య‌మా అని ఆంధ్రా, తెలంగాణ‌ల్లోని అధికార పార్టీలు కొత్త నేత‌ల‌తో ఉన్నాయి. చేరిన‌వారంద‌రికీ చోటు క‌ల్పించాలంటే కొత్త స్థానాలు కావాలి.

రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులూ కేంద్రంతో చాలాసార్లు సంప్ర‌దింపులు జ‌రిపినా కేంద్రం నుంచి సానుకూల స్పంద‌న రాలేదు. రాజ‌కీయంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచ‌డం వ‌ల్ల భాజ‌పాకి కొత్త‌గా ఒరిగేది ఏమీ లేదు. ఈ శీతాకాల స‌మావేశాల్లో బిల్లు పెట్టేస్తార‌ని అంటున్నా కొంత స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపున‌కు రాజ్యాంగ స‌వ‌ర‌ణ అవ‌స‌ర‌మా అనే అంశంపై కేంద్రం ద‌గ్గ‌ర స్ప‌ష్ట‌త లేదు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి కాబ‌ట్టి కేంద్రం నిర్ణ‌యం తీసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌నే చెప్పాలి. అయితే, ఈ బిల్లు విష‌య‌మై మిగిలిన పార్టీల వైఖ‌రి ఏంట‌నేది కూడా కీల‌క‌మే.

వాస్తవానికి ఈ ఆరు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచ‌డం వ‌ల్ల భాజ‌పాకి రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని భావిస్తే కాంగ్రెస్ ఊరుకోదు. మోకాలడ్డే ప్ర‌య‌త్నం ఖచ్చితంగా చేస్తుంది. ఆంధ్రా తెలంగాణల్లో నియోజ‌క వ‌ర్గాల సంఖ్య పెంపు అంశాన్ని భాజ‌పా రాజ‌కీయంగానే చూస్తోంద‌ని చెప్పొచ్చు. తెరాస‌, తెదేపాల్లోకి ఫిరాయింపుల ద్వారా చేరిన వారికి ఎన్నిక‌ల స‌మ‌యం వచ్చేస‌రికి అంద‌రికీ  ఆయా పార్టీలవారు ఇవ్వ‌లేరు. కాబ‌ట్టి, ఆ స‌మ‌యంలో భాజ‌పాలోకి వ‌ల‌స‌లు ఉంటాయ‌ని ఆశించార‌ని అనుకోవ‌చ్చు.