‘కార్పొరేట్ల’ కోసమే ‘క్యాష్ లెస్’ అంటున్నారా.?

535

పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదురహిత లావాదేవీల అంశం కీలకంగా మారింది.
పెద్దనోట్ల వల్ల కలుగుతున్న కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వాలన్నీ నగదు రహిత లావాదేవీలవైపు దృష్టిని మరల్చాయి. పైసలు చేతుల్లో లేకుండానే అమ్మకం, కొనుగోళ్ళు చేయవచ్చని ప్రచారం చేస్తున్నాయి. భవిష్యత్‌లో ప్రపంచమంతా దీనినే అనుసరించాల్సి ఉంటుందని పదే పదే నొక్కి చెబుతున్నారు. నగదురహిత లావాదేవీల వల్ల నల్లధనం, పన్నుల ఎగవేత మటుమాయమై, ఆర్థిక వ్యవహారాలన్నీ పారదర్శకంగా జరుగుతాయని కూడా అంటున్నారు.

అభివృద్ధి చెందిన దేశాలలో నగదు రహిత లావాదేవీలు అధికంగా జరుగుతుంటాయి. వినియోగదారుల వ్యయానికి సంబంధించి బెల్జియంలో 93 శాతం, ఫ్రాన్‌‌సలో 92 శాతం, కెనడాలో 90 శాతం, బ్రిటన్‌లో 89 శాతం, స్వీడన్‌లో 89 శాతం, ఆస్ట్రేలియాలో 86 శాతం, అమెరికాలో 80 శాతం, జర్మనీలో 76 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. ఆసియా నుంచి కేవలం దక్షిణ కొరియాలోనే 70 శాతం నగదు రహిత లావాదేవీలు సాగుతున్నాయి.

కానీ నగదు రహిత లావాదేవీలతో నైజీరియా స్వరూపమే మారిపోయింది. ఈ దేశంలో 30 శాతం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నవారు ఉన్నారు. వ్యవసాయానికి తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న ఆ దేశంలో రైతులకు అందే వ్యవసాయ రుణాలలో బ్యాంకుల వాటా ఒక్క శాతమే. 2012 నుంచి నగదు రహిత లావాదేవీలు, రైతుల కోసం ఈ-వ్యాలెట్‌లు ప్రవేశించాయి. వ్యవసాయం గిట్టుబాటుకాని రైతులందరి భూములను కార్పొరేట్ సంస్థలు వ్యాపార భాగస్వామ్యం పేరుతో ఆక్రమించుకున్నాయి. కార్పొరేట్ల భాగస్వామ్యంతో నడిచే అగ్రికల్చరల్ డీలర్ పద్ధతిని ప్రవేశ పెట్టటంతో అక్కడి వ్యవసాయరంగ స్వరూపం పూర్తిగా మారిపోయింది.  నగదు రహిత లావాదేవీలు వ్యవసాయరంగాన్ని కార్పొరేటీకరణ వైపు నెట్టింది.

మన దేశంలో ఇప్పటికే సాంకేతికత, ఆధునికత, పారిశ్రామికీకరణ పేరుతో పేదలను, ముఖ్యంగా ఆదివాసీలను, దళితులను ఉత్పత్తి రంగం నుంచి, జాతీయ జీవన స్రవంతి నుంచి వెలివేసారు. నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడ్డ పట్టణ కుటుంబాలు 11 శాతానికి మించవు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 5.2 కోట్ల మంది గ్రామీణులకు చెల్లింపులన్నీ నగదు రహితంగానే జరుగుతున్నాయి. అయినా వినియోగదారులుగా వారు చేసే వ్యయంలో నగదు రహితంగా సాగేది అసలు లెక్కలోకే రాదు. నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం అంటున్నట్టుగా విస్తరింపజేస్తే వడ్డీ వ్యాపారుల నుంచి రైతులకు రుణాలు అందవు. అదే అవకాశంగా  కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

పెద్ద నోట్ల రద్దుకు ముందు వరకు దేశంలోని  మొత్తం అన్ని రకాల లావాదేవీలలో కేవలం 2 శాతం మాత్రమే నగదు రూపంలో జరుగుతున్నాయి. అయినా మన దేశాన్ని నగదురహిత దేశంగా మార్చేస్తామని మోదీ ప్రభుత్వం అంటోంది.