కన్నా మాటల్లో ఏపీ భాజపా సీఎం అభ్యర్ధి ఎవరంటే.?

196

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ విషయంపై భారతీయ జనతాపార్టీ హైకమాండ్ ఏపీ నేతలకు ముందస్తు సంకేతాలు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఈ విషయంలో బయటపడ్డారు.

తిరుమలకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్న ఆయన రాజకీయాలు మాట్లాడారు. 2019లో ఏపీలో భాజపా ముఖ్యమంత్రి ఉంటారన్నారు. నిజానికి సీబీఐ మాజీ జేడీ భాజపాలోకి వెళ్తానని ఎప్పుడూ ప్రకటించలేదు. కనీసం చర్చలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా చెప్పలేదు. అలాంటిది ఆయన ప్రస్తావన వస్తే ఖండించాల్సిన కన్నా లక్ష్మినారాయణ అంతా హైకమాండ్ నిర్ణయం అన్నట్లు మాట్లాదరు.

ఈ నేపధ్యంలో భాజపాలో సీబీఐ మాజీ జేడీని చేర్చుకునే ప్రక్రియ నడుస్తున్నట్లు తేలిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ప్రస్తుతం జిల్లాల పర్యనటల్లో ఉన్నారు. జిల్లాల్లో ఉన్న సమస్యలను రెండు నెలలలో అధ్యయనం చేస్తానని ఆ తర్వాత కార్యాచరణ రూపొందించుకుటానని చెప్పిన ఆయన రాజకీయాల్లోకి వస్తానని ఇంత వరకూ నేరుగా ప్రకటించలేదు.

సీబీఐ మాజీ జేడీకి, ఆరెస్సెస్ తో దగ్గరి సంబంధాలున్నాయన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఉద్యోగ విరమణ తర్వాత జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా నోటి వెంట ఆ మాటలు అప్రయత్నంగా రాలేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వాస్తవానికి సీబీఐ మాజీ జేడీ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నప్పుడే ఆయన భాజపాలోకి వెళ్తారని వార్తలొచ్చాయి. ఇప్పుడు కన్నా మాటలను బట్టి చూస్తే అంతా ఓ పద్దతి ప్రకారమే భాజపా నడిపిస్తోందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.