బళ్లారిలో గాలి రాజకీయానికి తెరపడినట్లేనా.?

94

కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్ధన్ రెడ్డి శకం దాదాపుగా ముగిసిపోయింది. ఆయన కంచుకోట బళ్లారిలో ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉగ్రప్ప రెండున్నర లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అని చెప్పుకున్నా బళ్లారి ఏరియాలో జేడీఎస్ కు ఎలాంటి బలం లేదు. లోక్ సభ నియోజకవర్గం మొత్తం మీద జేడీఎస్ కు 20 నుంచి 30 వేల ఓట్లు మాత్రమే వస్తూంటాయి. కానీ గత లోక్ సభ ఎన్నికల్లో గాలి జనార్ధనరెడ్డి కుడి భుజం శ్రీరాములు సాధించిన మెజార్టీ 80వేలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెండున్నర లక్షల మెజార్టీ వచ్చింది.

భాజపా తరపున శ్రీరాములు సోదరి శాంత పోటీ చేసారు. బళ్లారిలోకి అడుగు పెట్టేందుకు గాలి జనార్ధన్ రెడ్డికి అనుమతి లేదు.  జిల్లా శివారులో మకాం వేసి ఉపఎన్నికలను పర్యవేక్షించినా ప్రయోజనం లేకపోయింది. 2004 నుంచి బళ్లారి పార్లమెంట్ స్థానాన్ని శాసిస్తున్న భాజపా కంచుకోట బద్దలైపోయింది. నిజానికి గాలి వర్గం రాజకీయంగా ప్రభావం కోల్పోతోందని గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయింది. జిల్లాలో మొత్తం 9 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా 6 స్ధానాల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించింది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీరాములు ప్రయత్నించారు. ఆ ఆడియో టేపులను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టటంతో గాలి వర్గీయుల రాజకీయంపై కర్ణాటక ప్రజలకు విరక్తి తెప్పించింది. రాజకీయంగా పట్టు లేకపోతే భాజపా కూడా గాలి వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉండదు. ఒక రకంగా గాలి వర్గ రాజకీయం అంతిమ దశకు చేరుకున్నట్లే అని భావిస్తున్నారు.