రేవంత్ కాంగ్రెస్ ‘బాహుబలి’ అవుతాడట.!

393

తెదేపాకి వీడ్కోలు పలికిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే ముహుర్తం ఖరారయింది. ఈ నేపధ్యంలో కొంతకాలం కిందట జానారెడ్డి చెప్పిన బాహుబలి ఇతడేనా, బాహుబలి వచ్చి కాంగ్రెస్ ని కాపాడతాడని జానారెడ్డి చెప్పింది  రేవంత్ రెడ్డి గురించేనా అని జనాలు సెటైర్లు వేసుకుంటున్నారు. ఇక రాంగోపాల్ వర్మ అయితే తనదైన శైలిలో ట్వీట్ చేసాడు.

గ‌తంలో కాంగ్రెస్ పార్టీ మీద ఆయ‌న‌కు ఎందుకు న‌మ్మ‌కం పోయిందో, అస‌లెలా పోయిందో తెలియ‌దుగాని… ఆ పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం ఫీల‌యిన‌ట్టే ఫీల‌వుతూ ”రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చింది” అంటూ సంబ‌ర‌ప‌డుతున్నాడు. ‘బాహుబలి నోట్ల వర్షం కురిపిస్తే ఈ బాహుబలి (రేవంత్ రెడ్డి) ఓట్ల వర్షం కురిపిస్తాడని ట్వీటాడు. రేవంత్ రెడ్డి, మాటకారి అనే విషయంలో, కొడంగల్ లో మంచి పేరు ఉందనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు కానీ, రేవంత్ కాంగ్రెస్ ని బయటపడేస్తాడని మాత్రం ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు. మహా అయితే తన నియోజకవర్గంలోనూ, లేదంటే మరో 2-3 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలుగుతాడేమో కానీ రాష్ట్రం మొత్తం ప్రభావం చూపించగలగడం కష్టమే.

వాస్తవానికి జానారెడ్డి ‘బాహుబలి వచ్చి కాంగ్రెస్ ని కాపాడతాడని’ అంటే దానర్థం బాహుబలి వస్తే తప్ప బాగుపడని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని. ఏదేమైనా తెలంగాణ కాంగ్రెస్ కి కావాల్సింది బాహుబలి, కబాలిలు కాదు. తమలో తాము కొట్టుకోకుండా అంతర్గత సమస్యలని పరిష్కరించుకుంటూ సమస్యలని సరైన పద్దతిలో లేవనెత్తుతూ సమిష్టిగా కెసియార్ మీద పోరాడటం కావాలి.