శిల్పాకు టికెట్ ఇవ్వటం వెనక ఇంతుందా.?

381

నంద్యాల ఉప ఎన్నిక‌ను అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎంత సీరియ‌స్ గా తీసుకున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్ ఆశించి, త‌రువాత వైకాపాలో చేరి టిక్కెట్ ద‌క్కించుకున్నారు శిల్పా మోహ‌న్ రెడ్డి. భూమా అఖిల ప్రియ వ‌ర్గం నుంచి బ్ర‌హ్మానంద రెడ్డికి టిక్కెట్ ద‌క్కింది. రెండు పార్టీలూ ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి కాబ‌ట్టి ఖ‌ర్చు విష‌యంలో ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గే ప‌రిస్థితి దాదాపు ఉండ‌ద‌నే చెప్పాలి. తెలుగుదేశం అధికారంలో ఉంది కాబ‌ట్టి కాస్త ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ విష‌యం విప‌క్ష నేత జ‌గ‌న్ కు ముందే తెలుసు కాబ‌ట్టే ఏరికోరి శిల్పా మోహ‌న్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చార‌ని క‌థ‌నం.

వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నిక‌లో వైకాపా సీటు కోసం రాజ‌గోపాల్ రెడ్డి తీవ్ర ప్ర‌య‌త్న‌మే చేసారు. త‌న‌కు టిక్కెట్ ఖాయ‌మ‌ని అనుకున్నారు. ఇక‌, గంగుల వ‌ర్గం కూడా వైకాపా టిక్కెట్ ఆశించింది. కానీ, చివ‌ర్లో వ‌చ్చిన శిల్పా మోహ‌న్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వ‌డం వెన‌క ఓ ఒప్పందం ఉంద‌ని తెలుస్తోంది. త‌న‌కు టిక్కెట్ ఇస్తే నంద్యాల ఎన్నిక‌ల‌కు కావాల్సిన ఖ‌ర్చంతా సొంతంగా భ‌రించుకుంటాన‌నీ, పార్టీ నుంచీ ఒక్క రూపాయి కూడా ఆశించ‌న‌ని శిల్పా ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. జ‌గ‌న్‌, శిల్పాల మ‌ధ్య ఉప ఎన్నిక‌ల ఖ‌ర్చువెచ్చాల సంగ‌తే ప్ర‌ధానంగా చ‌ర్చకు వ‌చ్చింద‌నీ, ఆ త‌రువాతే శిల్పాకి జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారని ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. టిక్కెట్ ఇస్తే చాల‌నీ, ఉప ఎన్నిక‌లో గెలిచి వ‌స్తాన‌ని కూడా జ‌గ‌న్ కు శిల్పా హామీ ఇచ్చార‌ట‌.

ఉప ఎన్నిక‌ల్లో భారీగా ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంద‌నీ, శిల్పాకి అవ‌కాశం ఇస్తే ఆ ఖ‌ర్చేదో ఆయ‌నే పెట్టుకుంటార‌నీ, దాని వ‌ల్ల పార్టీకి మేలు జ‌రుగుతుంద‌ని ఈ రెండు వ‌ర్గాల‌కు నచ్చచెప్పే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని చెబుతున్నారు. ప్ర‌తిప‌క్ష‌మే ఇంత వ్యూహాత్మ‌కంగా ఖ‌ర్చు విష‌యంలో ఉంటే, ఇక అధికార పార్టీ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.