హిందీని దక్షిణాదిలో కూడా తప్పనిసరి చేస్తారా.?

131

కేంద్రం దక్షిణాదిపై హిందీ భాషను రుద్దే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నూతన విద్యావిధానంపై తొమ్మిది మంది నిపుణులతో కమిటీ వేసింది. ఈ కమిటీ దేశం మొత్తం హిందీని ఎనిమిదో తరగతి వరకూ తప్పని సరి చేయాలని సూచించినట్లు ప్రచారం జరగుతోంది.

ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గోవా, పశ్చిమ్‌ బంగ, అసోం వంటి రాష్ట్రాల్లో హిందీ తప్పనిసరనే నిబంధన లేదు. కొన్ని పాఠశాలలు మాత్రమే ఈ నిబంధనను అనుసరిస్తున్నాయి. దేశమంతా ఒకే తరహాలో, శాస్త్రీయ కోణంలో విద్యార్థులు విషయాన్ని నేర్చుకొనే లక్ష్యంతోనే జాతీయ విద్యావిధానంలో మార్పులు తేవాలనుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెపుతోంది.

గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని రుద్దే ప్రయత్నం చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వివాదాస్పదం అయ్యింది. ఉత్తరాదిలో దాదాపుగా అందరూ హిందీ మాట్లాడతారు. చాలా రాష్ట్రాల్లో భాషలు హిందీకి దగ్గరగా ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ దక్షిణాదిలో మాత్రం రాష్ట్రానికో భాష ఉంటుంది.

ఈ తరుణంలో కేంద్రం నూతన విద్యావిధానం అంటూ హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తే మరోసారి వివాదం అయ్యే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు భాషా సెంటిమెంట్ ను పైకి తెస్తే ప్రజలు కూడా పరాయి భాషను అంగీకరించడానికి సిద్ధపడరు.