వైకాపా ఎంపీల దీక్ష ఫెయిలయినట్లేనా.!

125
రాజీనామాలు చేసి ప్ర‌త్యేక హోదా సాధించే వ‌ర‌కూ ఢిల్లీ వ‌దిలేదే లేదంటూ భీష్మించిన వైకాపా ఎంపీల దీక్షను పోలీసులు భ‌గ్నం చేసారు. అనారోగ్య కార‌ణాల‌తో వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించార‌నీ, ఎంపీలు వ‌ద్దంటున్నా ఫ్లూయిడ్స్ ఎక్కించి, దీక్ష భ‌గ్నం చేసారంటూ వైకాపా నేత‌లు అంటున్నారు. ఏదైతేనేం, ప్ర‌త్యేక హోదా కోసం మొద‌లుపెట్టిన వైకాపా ఢిల్లీ పోరాటం కూడా చివ‌రికి రాష్ట్రానికే చేరుకుంది.
హోదా పోరు పేరుతో వైకాపా చేసిన ప్ర‌య‌త్నాలూ, దీక్ష‌ల‌పై ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల నుంచి మిశ్ర‌మ స్పంద‌నే వ్య‌క్త‌మౌతోంద‌ని చెప్పాలి. దీక్ష పేరుతో హంగామా చేసినా, భాజ‌పా స‌ర్కారును ఏమాత్ర‌మూ ప్ర‌భావితం చేయ‌లేకపోయార‌న్న‌ది వాస్త‌వం. ఇత‌ర పార్టీల నుంచి కూడా ఆశించిన స్థాయిలో మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకోలేక‌పోయారు. తాము చేస్తున్న దీక్ష‌ల‌కు తెదేపా మ‌ద్ద‌తు ఇవ్వాల‌నీ, ఆ పార్టీ ఎంపీలూ రాజీనామాలు చేయాల‌నీ, లేక‌పోతే చ‌రిత్రహీనులుగా మిగిలిపోతార‌నీ ఇలా వ్య‌తిరేక‌ ధోర‌ణిలోనే వైకాపా ప్ర‌య‌త్నాలు సాగాయి. హోదా అంశంలో చంద్రబాబు ఫెయిల్ కావ‌డం వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితి వచ్చింద‌ని మాత్ర‌మే విమ‌ర్శలు చేస్తూ కాల‌యాప‌న చేసారు.
దీక్ష మొద‌లుపెట్టిన ఐదుగురు ఎంపీల్లో ముగ్గుర్ని అనారోగ్య కార‌ణాల‌తో ఆసుప‌త్రికి త‌ర‌లించిన త‌రువాత‌ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీని వైకాపా సంప్రదించిందట‌. ‘మీ పార్టీ ప్ర‌తినిధుల‌ను మా ఎంపీల దీక్షా శిబిరానికి పంపించాలని’ వైకాపా నేత‌లు కోరినా తృణ‌మూల్ నుంచి సానుకూల స్పంద‌న రాలేద‌నీ, ప‌శ్చిమ బెంగాల్ లో పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి, ఒక‌ట్రెండు రోజుల్లో ఆ పార్టీ నేత‌ల‌ను వ‌చ్చే అవ‌కాశం ఉందంటూ జాతీయ మీడియాతో మూడ్రోజుల కింద‌ట చెప్పారు. కానీ, ఆ త‌రువాత తృణ‌మూల్ నుంచి ఎవ్వ‌రూ వ‌చ్చింది లేదు.
సీపీఐ(ఎమ్‌) జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సీతారాం ఏచూరి, సీపీఐ నాయ‌కుడు డి. రాజా, శ‌ర‌ద్ యాద‌వ్‌, సీపీఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుర‌వం సుధాక‌ర్ రెడ్డి మాత్ర‌మే వైకాపా ఎంపీల దీక్షా శిబిరాల‌కు వ‌చ్చి, ప‌ల‌క‌రించి వెళ్ళారు. దీక్షలు ముగిసిపోయాయి. వైకాపా ఎంపీల దీక్ష‌కు ఇత‌ర పార్టీ నుంచి స్పంద‌న రాక‌పోవ‌డానికి అస‌లు కార‌ణం కేంద్రాన్ని ప్ర‌శ్నించే స్థాయిలోగానీ, భాజ‌పాకి వ్య‌తిరేకంగా వైకాపా పోరాటం చేస్తోంద‌న్న న‌మ్మ‌కంగానీ ఎవ్వ‌రికీ క‌ల‌గ‌కపోవటమే. పార్ల‌మెంటులో అవిశ్వాసం తీర్మానం పెట్టిన ద‌గ్గ‌ర్నుంచీ ఎంపీల రాజీనామాలూ దీక్ష‌ల వ‌ర‌కూ ‘వైకాపా పోరాటం భాజ‌పాకి వ్య‌తిరేకంగా సాగుతోంద‌నే’ అభిప్రాయాన్ని క‌లిగించ‌లేక‌పోయారన్నది వాస్తవం.