రేవంత్ అంశంపై తెరాస మౌనానికి కారణం ఇదేనా.?

408

రేవంత్ రెడ్డి పార్టీ మార్పు వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న పార్టీ వీడిపోతున్న స‌మ‌యంలో తెలుగుదేశం నేతలు చాలా విమ‌ర్శ‌లు చేసారు. కాంగ్రెస్ లో చేరుతున్న సంద‌ర్భంగా ఆ పార్టీ నాయ‌కులూ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కానీ ఈ అంశంపై తెరాస మాత్రం స్పందించ‌టం లేదు.

కేసీఆర్ వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఏకం చేయాల‌న్నదే త‌న పోరాట పంథాగా రేవంత్ చెబుతూ వ‌స్తున్నారు. మొన్న కొడంగ‌ల్ లో కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మైన‌ప్పుడుగానీ, నిన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ హాజ‌రైన స‌మావేశంలోగానీ రేవంత్ చెబుతున్న మాట ఇదే. అయితే, ఇంత జ‌రుగుతున్నా అధికార పార్టీ నుంచి ఎవ్వ‌రూ పెద్ద‌గా స్పందించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలపై తెరాస మౌనంగానే ఉంటోంది. ఇదంతా వ్యూహాత్మక‌ మౌనం అనుకోవ‌చ్చా.?

వాస్తవానికి ఈ తరుణంలో రేవంత్ మీద తెరాస కూడా విమ‌ర్శ‌లు ప్రారంభిస్తే, అది రేవంత్ కు మ‌రింత ప్ర‌చారం తెచ్చిపెట్టిన‌ట్టు అవుతుంది. కాంగ్రెస్ లో చేరుతున్న ఈ తరుణంలో ఆయ‌న‌కు మ‌రింత ప్రాధాన్య‌త పెంచిన‌ట్టు అవుతుంది. అందుకే, తెరాస నేత‌లు మౌనంగా ఉన్నార‌ని అనుకోవ‌చ్చు. అయితే తెర వెన‌క తెరాస చేయాల్సిన ప‌నుల‌న్నీ చేస్తోంద‌ని తెలుస్తోంది. నిజానికి, ఓ నెల రోజుల కింద‌ట నుంచే అధికార పార్టీ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు మొద‌ల‌య్యాయని చెప్పొచ్చు. కొడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంపై మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక దృష్టి పెట్టార‌ట‌.

ఉప ఎన్నిక రావొచ్చ‌నే ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తోనే ఆ నియోజ‌క వ‌ర్గంపై మంత్రి ప్రత్యేక శ్ర‌ద్ధ పెట్టిన‌ట్టు చెబుతున్నారు. దాన్లో భాగంగానే ఈ మ‌ధ్య కొంత‌మంది కొడంగ‌ల్ నేత‌లు తెరాస‌లో చేరిక జ‌రిగింద‌ని చెబుతున్నారు. కొడంగ‌ల్ ఉప ఎన్నిక విష‌య‌మై అధికార పార్టీలో ప్ర‌ముఖ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌నీ, రేవంత్ పార్టీ వీడ‌టం ఖాయ‌మ‌ని వారు ఓ అంచ‌నాకు ముందే వ‌చ్చార‌నీ, తెరాస‌పై రేవంత్ ఎంతగా నోరు పారేసుకున్నా నేత‌లు సంయ‌మ‌నం పాటించాల‌ని కూడా అధినాయ‌క‌త్వం సూచ‌న‌లు చేసినట్లు తెలుస్తోంది.