ఐటీ సోదాలు ‘ఓటుకు నోటు’ కేసులో భాగమేనా?

174

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్ళలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఉదయం నుంచి రేవంత్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్ళలో తనిఖీలు సాగుతున్నాయి.

ఓటుకు నోటు కేసులో రూ. 50 లక్షలను స్టీఫెన్సన్ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని అప్పట్లో ఐటీ అధికారులకు అందించారు. ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై అప్పట్లో పోలీసులు విచారణ చేసారు. ఆ సమయంలోనే రేవంత్‌కు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసారు. ఇప్పుడు హఠాత్తుగా రేవంత్‌రెడ్డితో పాటు అతడి సోదరుల ఇళ్ళలోనూ సోదాలు ప్రారంభించారు. హైదరాబాద్‌తో పాటు కొడంగల్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

తనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించబోతున్నారని కొద్ది రోజుల కిందట రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. తగ్గట్లుగానే ఇప్పుడు ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడులు చేసారు. మూడున్నరేళ్ళ కిందటి కేసులో ఇప్పుడు సోదాలు చేస్తే ఏమి తెలుస్తుందని రాజకీయ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీయడానికి ఈ సోదాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

రేవంత్‌ రెడ్డికి సంబంధించిన భూపాల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌పైనా అధికారులు తనీఖీలు చేస్తున్నారు. గత కొంత కాలంగా ఓటుకు కోట్లు కేసు నత్తనడకన నడుస్తోందని, కేసు నీరుగారుతుందంటూ విమర్శలు వినిపిస్తున్న తరుణంలో ఐటీ దాడులు రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. గురువారం ఉదయం నుంచి చేపట్టిన ఐటీ సోదాల్లో అసలు దోషులు బయటకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవిలపై దర్యాప్తు చేయాల్సిందిగా ఈ నెల 13న ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఐటీ శాఖకు లేఖ రాసారు. ఏసీబీ లేఖ అందగానే ఆదాయపు పన్ను శాఖ పని ప్రారంభించింది.