‘కథానాయకుడు’ రివ్యూ : వెండితెర వేల్పుకి నీరాజనం

342

టాలీవుడ్‌లో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. గత ఏడాది ‘మహానటి’ సినిమా ఘనవిజయం సాధించటంతో తెలుగు సినీరంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన నందమూరి తారక రామారావు జీవితకథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తండ్రి పాత్రలో బాలకృష్ణ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న యన్‌.టి.ఆర్‌ ‘కథానాయకుడు’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేమంటే..

క్యాన్సర్‌తో బాధపడుతున్న బసవ రామ తారకం (విద్యాబాలన్) పరిచయంతో సినిమా ప్రారంభమవుతుంది. రామారావు (బాలకృష్ణ) రిజిస్టర్‌ ఆఫీస్‌లో మంచి ఉద్యోగం వచ్చినా అక్కడి పరిస్థితులు, ఉద్యోగుల పద్దతులు నచ్చక చేరిన మూడు వారాల్లోనే ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. రామారావు వేసిన నాటకం చూసిన ఎల్వీ ప్రసాద్‌ (జిష్షు) సినిమా అవకాశం ఇస్తాననటంతో మద్రాస్‌ బయల్దేరుతాడు. అలా మద్రాసు చేరిన రామారావు సినీ ప్రయాణం ఎలా మొదలైంది. మొదట్లో నటుడిగా ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులేంటి. అక్కినేని నాగేశ్వర్రావు (సుమంత్)తో ఆయన అనుబంధం. వెండితెర వేల్పుగా ఎన్టీఆర్‌ ఎదిగిన తీరు, రాజకీయాలవైపు నడిపించిన పరిస్థితులే సినిమా కథ. ఎన్టీఆర్ రాజకీయ పార్టీని ప్రకటించటంతో తొలి భాగం ముగిసింది.

ఎలా ఉందంటే..

ఎన్టీఆర్ చ‌రిత్ర తెలియంది కాదు. అందుకే దర్శకుడు దశాబ్దాలుగా జనాలకు తెలిసిన విషయాలే సినిమాటిక్‌గా వెండితెర మీద చూపించే ప్రయత్నం చేసాడు. ఎన్టీఆర్ తొలి నాళ్ళ ప్ర‌యాణం, సినిమాల్లోకి రావ‌డం, ఎదురైన ఆటుపోట్లు, అవ‌కాశాల కోసం నిరీక్ష‌ణ‌ ఆసక్తిక‌రంగా మ‌లిచాడు. తొలి అవ‌కాశం వ‌చ్చిన విధానం, కృష్ణుడిగా మారిన వైనం, ఏఎన్నార్‌తో అనుబంధం, మొండిగా తీసుకున్న నిర్ణ‌యాలు, రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల కోసం జోలె ప‌ట్ట‌డం, దివిసీమ‌కు క‌ష్టం వ‌స్తే త‌ల్ల‌డిల్లిపోవ‌డం, క‌న్న‌ కొడుకు ఆఖ‌రి క్ష‌ణాల్లో ఉన్న‌ప్ప‌టికీ నిర్మాత‌కు న‌ష్టం రాకూడ‌ద‌న్న ఉద్దేశంతో షూటింగ్ అయ్యేంత వ‌ర‌కూ సెట్లో ఉండ‌డం ఇలా ప్ర‌తీ విష‌యాన్నీ అందంగా, హృద్యంగా, చ‌రిత్ర పుస్త‌కాన్ని తిర‌గేస్తున్న‌ట్టు చెప్పుకుంటూ వెళ్ళాడు క్రిష్‌.

ఓ భ‌ర్త‌గా, ఇంటి పెద్ద‌గా ఆయ‌నేంటి? త‌మ్ముడితో త‌న అనుబంధం ఏమిటి? రామ‌కృష్ణ మ‌శూచీతో చ‌నిపోయిన‌ప్పుడు తండ్రిగా ఎన్టీఆర్ ప‌డిన ఆవేద‌న‌ని కూడా చూపించ‌డంతో ఎన్టీఆర్‌లోని రెండో కోణం అర్థ‌మైంది. ప్ర‌ధ‌మార్థం అంతా క‌థానాయ‌కుడిగా ఎన్టీఆర్ సాగించిన ప్ర‌యాణం క‌నిపిస్తుంది. దాంతో ర‌క‌ర‌కాల గెట‌ప్పుల్లో బాల‌య్య‌ని చూసే అవ‌కాశం అభిమానుల‌కు ద‌క్కింది. ఎన్టీఆర్ జీవితంలో ఏఎన్నార్‌కీ త‌గిన ప్రాధాన్యం ఉంది. అందుకే వారిద్ద‌రి అనుబంధానికి పెద్ద పీట వేసారు. అక్క‌డ‌క్క‌డ‌ స్లో గా అనిపించినా అన్నీ చూపించాల‌న్న తాప‌త్ర‌యంలో స‌న్నివేశాలు అల్లుకుపోవ‌డంతో దానిని భ‌రించాల్సి వ‌స్తుంది.

ఎవరెలా:

సినిమా అంతా ‘ఎన్టీఆర్‌’ పాత్ర చుట్టూనే తిరగటంతో ప్రతీ ఫ్రేమ్‌లో బాలయ్యే తెర మీద కనిపిస్తారు. ఎన్టీఆర్‌ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో బాలయ్య లుక్‌ అంతగా ఆకట్టుకునేలా లేదు. వయసైన పాత్రలో బాలయ్య లుక్‌, పర్ఫామెన్స్‌ బాగుంది.  ఎన్టీఆర్ సతీమణి బసవ రామ తారకం పాత్రకు విద్యాబాలన్‌ లాంటి నటిని ఎందుకు తీసుకున్నారో సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమ్‌ రావు పాత్రలో దగ్గుబాటి రాజా కనిపించాడు. అక్కినేని పాత్రలో ఆయన మనవడు సుమంత్ జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రకు మరొకరిని ఊహించుకోలేనంత స్థాయిలో ఒదిగిపోయాడు. ఇతర పాత్రల్లో ఎంతో మంది హేమా హేమీల్లాంటి నటులు కనిపించారు. ప్రతీ ఒక్కరు తమ పాత్రకు పూర్తి న్యాయం చేసారు. బుర్రా సాయిమాధవ్ తన డైలాగులతో మెరుపులు మెరిపించారు.

ఫైనల్ గా..

ద‌ర్శ‌కుడు ఓ కథ‌లోని పాజిటీవ్ కోణాన్ని మాత్ర‌మే సృశించారు. సినిమాలో కొన్ని కొన్ని లోపాలున్నా ఎన్టీఆర్ అభిమానులకు పండగే.!