నంద్యాలలో మరింత దూకుడుగా జగన్

336

నంద్యాల ఉపఎన్నిక సమీపిస్తున్నకొద్దీ జగన్ మాటల పదును పెంచుతున్నాడు. మొన్ననే “చంద్రబాబును కాల్చి చంపినా తప్పులేదు” అని వ్యాఖ్యానించి ఎన్నికల కమీషన్ నుంచి నోటీసు అందుకున్నప్పటికీ, “చంద్రబాబును ఉరి తీసినా తప్పులేదు” అని మరోసారి మరింత ఘాటైన వ్యాఖ్య చెయ్యడం ద్వారా తన దూకుడు ఏమాత్రం తగ్గదు అని చాటి చెప్పాడు. ముందుముందు ఈ వ్యాఖ్యల తీవ్రత మరెంత దూరం వెళ్తుందో చెప్పలేము.

విచిత్రం ఏమిటంటే…’జగన్ ను ఉరి తియ్యాలని” గత మూడేళ్ళ నుంచి కాబోయే గవర్నర్ మోతుకుపల్లి నరసింహులు నిన్న మీడియా ముందు ప్రకటించారు. బహుశా జగన్ ను తిట్టడమే గవర్నర్ పదవికి కాబోయే అర్హత అని మోత్కుపల్లి ఫిక్స్ అయినట్లున్నారు. ఒక నాయకుడిని ఉరి తియ్యాలని ప్రకటించిన వ్యక్తికీ బీజేపీ గవర్నర్ పదవి ఇస్తుందేమో చూడాలి. జగన్ ను వురి తియ్యాలి అని పబ్లిగ్గా చెప్పిన మోత్కుపల్లిని తెలుగుదేశం నాయకులు తప్పు పట్టలేదు.

ఇక మళ్ళీ నంద్యాల విషయానికి వస్తే గత కొద్దీ రోజులుగా జగన్ కు అనేక అంశాలు అనుకూలంగా మారుతున్నాయి. తాజాగా లేపాక్షి భూముల పందేరంలో తప్పు లేదని, అంతా బిజినెస్ రూల్స్ ప్రకారమే జరిగిందని ఆ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ అధికారి శ్యాంబాబును కేసునుంచి హైకోర్టు విముక్తం చెయ్యడం జగన్ లో కొత్త హుషారును తెచ్చిపెట్టినట్లుంది. అలాగే, ఆంద్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ నంద్యాల ఉపఎన్నికలో వైసిపి ఏడువేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని సర్వే ఫలితాన్ని ప్రకటించడం జగన్ కు అదనపు బలాన్ని ఇచ్చే అంశమే. ఇక జగన్ మొన్న నిర్వహించిన సభ ఊహించినదానికంటే విజయవంతం అయింది. జనం వరదలా పొంగారు. ప్రతిపక్షనాయకుడు సభకు అంతమంది జనం వస్తే ఇక అధికారపార్టీకి గుండెల్లో రైళ్లు పరిగెత్తకుండా ఎలా ఉంటుంది?

Jagan ahead of chandrababu in Nandyalనంద్యాలలో మరింత దూకుడుగా జగన్

తెలుగుదేశం ప్రచారం గత రెండు మూడు రోజులుగా డీలా పడ్డది. నంద్యాల నియోజకవర్గ ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు వారు జవాబులు చెప్పుకోలేక పోతున్నారు. అఖిలప్రియ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. వారి కుటుంబం పట్ల సానుభూతి ఉంటె ఉండవచ్చు కానీ, ఆ సానుభూతిని తనకు అనుకూలంగా మలచుకునే చాకచక్యం ఆమె దగ్గర ఉన్నట్లు కనిపించడం లేదు. వైసిపి అభ్యర్థి కూడా రాజకీయంగా, ఆర్ధికంగా బలమైన వ్యక్తి కావడం కూడా తెలుగుదేశంలో ఓటమి భయాన్ని కలిగిస్తున్నది. చంద్రబాబు వైఖరి చూస్తుంటే ఆయనకు నంద్యాల మీద ఆశలు సన్నగిల్లినట్లే కనిపిస్తున్నది.

ఇక జనసేనాని కూడా నంద్యాల వెళ్తున్నట్లు ఇంతవరకు సమాచారం లేదు. కాంగ్రెస్ మృతదేహం లాంటిది. కమ్యూనిస్టులకు తావే లేదు. ఇక బీజేపీ తెలుగుదేశం కు మద్దతు ప్రకటించింది కానీ, అక్కడ బీజేపీ ని పట్టించుకునే నాధుడు ఎవడు? ఇక తెలుగుదేశం నమ్ముకున్నది బాలకృష్ణ గ్లామర్ మీద. నంద్యాలలో బాలకృష్ణ ప్రభావం కనిపిస్తుంది అనే నమ్మకం నాకు లేదు.

ఏతావాతా చెప్పుకునేది ఏమిటంటే.. ఈరోజు వరకు నంద్యాలలో వైసిపి కె గెలుపు అవకాశాలు ఉన్నాయి. కాకపొతే మెజారిటీ ఏడువేల వస్తుందా? పదివేలు వస్తుందా? అనేది చూడాలి. కొందరు నాయకులు ఇరవై, ముప్ఫయి వేలు కూడా అంచనా వేస్తున్నారు కానీ… అంత మెజారిటీ గనుక వస్తే ఇక చంద్రబాబు పతనం ప్రారంభం అయినట్లే.

– ఇలపావులూరి మురళీ మోహన రావు